CM KCR Delhi Tour 3rd Day: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజధాని హస్తిన పర్యటన ఇవాళ్టికి మూడో రోజూ కొనసాగుతోంది. ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. అటు, కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను సైతం కేసీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి మంత్రులకు వినతిపత్రం సమర్పించనున్నారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రధాని మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. 45 నిమిషాలపాటు వారిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించారు సీఎం కేసీఆర్. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు ప్రధాని.
అవి కాక, కృష్ణా, గోదావరి ప్రాజెక్ట్‌లను బోర్డుల పరిధిలోకి తెస్తూ ఇచ్చిన గెజిట్, దానిపై రాష్ట్ర అభ్యంతరాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. నీళ్ల కేటాయింపు, ప్రాజెక్ట్‌లకు అనుమతి, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలను వివరించారు. ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, రాష్ట్రంలో టెక్సటైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేయాలని మోదీని సీఎం కేసీఆర్ కోరారు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ హోంమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్ర అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.
Read also: Afghanistan: పంజ్‌షేర్ మా వశమైపోయింది.. ఆఫ్ఘన్ మొత్తం తమదేనని ప్రకటించుకున్న తాలిబన్లు