CM KCR visits Muchintal Ashramam: రంగారెడ్డిజిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్..కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆశ్రమంలోని వేదపండితులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్‌తోపాటు వారి కుటుంబ సభ్యులను శాలువలతో చినజీయర్ స్వామి సత్కరించి…ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జీవ ప్రాంగణంలోని కుటీరంలో చినజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
భగవత్ రామానుజచార్య ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా కుటీర ప్రాంగణంలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను చినజీయర్ స్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే, యాదాద్రిలో పునర్ నిర్మించిన భవ్యమైన ఆలయాన్ని నవంబర్ లేదా డిసెంబర్‌లో ప్రారంభించే విషయంపై చర్చించినట్లు సమాచారం.
Read Also… Andhra Pradesh: భారీ సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్.. ఆదమరిస్తే చిక్కులు తప్పవంటున్న అధికారులు