హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ, మెట్రో రైల్, పురపాలక శాఖ, ఎయిర్‌పోర్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.
డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణం ఏర్పాట్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు గురువారం నాడు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికలపైన ఇప్పటినుంచే కసరత్తు చేయాలని పోలీస్ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని, ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాజెక్టు అన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన అందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..