Telangana Cm Kcr: కేంద్రం చర్యల వెనుక భారీ కుట్ర.. నాగళ్లు ఎత్తాలంటూ రైతులకు సీఎం పిలుపు..!

Telangana Cm Kcr: దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి..

Telangana Cm Kcr: కేంద్రం చర్యల వెనుక భారీ కుట్ర.. నాగళ్లు ఎత్తాలంటూ రైతులకు సీఎం పిలుపు..!

Updated on: Jan 12, 2022 | 6:15 PM

Telangana Cm Kcr: దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ సాయంత్రం ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్నారు.

రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం యొక్క నడ్డి విరిచిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం ఉల్టాగా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఈ నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందన్నారు. బీజేపీ సర్కార్.. దేశంలో రైతులను బతనిచ్చేట్లుగా లేదని తీవ్రంగా స్పందించారు.

కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం, ఎన్‌ఆర్‌జీఈ ని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం, విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం, రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం వెనక భారీ కుట్ర దాగి వుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు.

గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని, పెంచిన ఎరువు ధరలు తగ్గించే వరకు బీజేపీ ప్రభుత్వంపై సాగించే పోరాటంలో కలిసి రావాలని రైతాంగానికి కేసీఆర్ పిలుపునిచ్చారు.

Also read:

Fake Numbers: రిపేర్ కోసం వారికి కాల్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త, ఇది ఒకసారి చూడండి..

Extra Marital Relationship: అక్షరం ముక్క రాదు కానీ.. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను..

Telangana: సంక్రాంతి తరువాత అక్కడికి వెళతాం.. వనామా వ్యవహారంలో వీహెచ్ కీలక వ్యాఖ్యలు..