Dalitha Bandhu: ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. “నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా” అని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని వ్యాఖ్యానించారు. ఎప్పటి నుంచి ఎవరు పెట్టారు గానీ.. ఇది దుర్మార్గమైన ఆచారమని, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేయాలని అన్నారు. దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని సీఎం మరోమారు పునరుద్ఘాటించారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం స్పష్టం చేశారు. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం అన్నారు.
శుక్రవారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ‘‘రైతుబంధు, రైతు బీమాతో రైతులకు ఉపశమనాన్ని కలిగించాం. గత వలస పాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకుంది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నాము. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నాం. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్ధిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేశాను. దళితబంధు గత సంవత్సరమే ప్రారంభమవ్వాల్సింది. కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది.
Also read:
Telangana News: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఆవులను దొంగిలించి ఆపై జింక మాంసం అంటూ..
Viral Video: అడవి దున్నను నోటకరిచిన సింహం.. వేటలో షాకింగ్ ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారంటే!