CM KCR Pays Tribute Rosaiah: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదిలావుంటే, రోశయ్య అంత్యక్రియలు రేపు ఆదివారం మధ్యాహ్నం కొంపల్లి ఫాంహౌస్‌లో జరుగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం వరకు అమీర్‌పేట్‌లోని నివాసంలోనే రోశయ్య భౌతికకాయం ఉండనుంది. రేపు ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు గాంధీభవన్‌లో భౌతికకాయం సందర్శనకు ఉంచనున్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర సాగనుంది.
మాజీ సీఎం రోశయ్య మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రోశయ్య ఇవాళ ఉదయమే కన్నుమూశారు. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నిద్రలోనే రోశయ్య తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
మరోవైపు రోశయ్య మృతికి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
Read Also…. CJI NV Ramana: 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా.. ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలిః సీజేఐ ఎన్వీ రమణ