
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. నిరంతర సంస్కరణ శీలిగా దేశ చరిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తోందని కేసీఆర్ అన్నారు.
అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ మాజీ ప్రధాని అవలంబిస్తున్న వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్టపరిచిందని కొనియాడారు. బహు భాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో పీవీ నరసింహారావు విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఇలాంటి సేవలు అందించిన పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తోందని గుర్తు చేశారు.
పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు,ఆలోచనలు తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. అలాగే పీవీ పేరుతో స్టాంప్‌ను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామని అన్నారు.