Raithu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే రైతు బంధు సొమ్ము ఖాతాల్లో జమ

|

Dec 27, 2021 | 8:36 AM

ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతన్నకు ఆసరాగా నిలిచే రైతు బంధు చెల్లింపులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 61లక్షల 49 వేల మంది రైతులకు యాసంగి పంట సీజన్‌ నిమిత్తం ఎకరాకు 5 వేల చొప్పున.. మొత్తం 7వేల 600 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి.

Raithu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే రైతు బంధు సొమ్ము ఖాతాల్లో జమ
Rythu Bandhu Scheme
Follow us on

Telangana Rythu Bandhu Scheme: ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతన్నకు ఆసరాగా నిలిచే రైతు బంధు చెల్లింపులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 61లక్షల 49 వేల మంది రైతులకు యాసంగి పంట సీజన్‌ నిమిత్తం ఎకరాకు 5 వేల చొప్పున.. మొత్తం 7వేల 600 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి. 1కోటి 52లక్షల ఎకరాలకు డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ప్రతి గుంట భూమికీ సాయమందాలన్నారు.

రైతుబంధు’ పథకం నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇందుకు అనుగుణంగా వ్యవసాయ, ఆర్థికశాఖలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌లో మొత్తం రూ.7,600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ వానాకాలంలో మొత్తం కోటిన్నర ఎకరాలకు చెందిన 63.25 లక్షల కమతాలకు రూ.7,508.78 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ భూముల క్రయవిక్రయాలతో రెవెన్యూ రికార్డుల్లో నమోదైన రైతుల పేర్లను ఈ నెల 31లోగా నమోదు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)ను వ్యవసాయశాఖ ఆదేశించింది.
అయితే, కొత్తగా భూములను కొన్న రైతులు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూఖాతా వివరాలను తెచ్చి ఇస్తే రైతుబంధు పోర్టల్‌లో వివరాలను ఏఈవోలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ కొత్తగా 20 వేల మంది భూములు కొన్నట్లు రెవిన్యూ రికార్డుల ప్రకారం వెల్లడవుతోంది. వారి వివరాలను ఏఈవోలు నమోదు చేస్తేనే రైతుబంధు సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అధికారులు వెల్లడించారు. సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలనే లక్ష్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా మారింది. సీఎం వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఈ నెల 28 నుంచి తొలుత ఎకరా భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము వేస్తారు. రెండో రోజున ఎకరా నుంచి 2, మూడో రోజున 2 నుంచి 3 ఎకరాలు.. ఇలా రోజూ ఎకరా విస్తీర్ణం చొప్పున పెంచుతూ సొమ్మును జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎకరా పెంచేకొద్దీ ఎందరు రైతులున్నారు, వారి బ్యాంకు ఖాతాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, రెవెన్యూ ఖాతాల వివరాలను ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తున్నారు. సొమ్ము జమచేశాక వ్యవసాయశాఖ నుంచి రైతు సెల్‌ఫోన్ నంబరుకు మెసేజ్ రూపంలో ప్రభుత్వం తరఫున సమాచారం అందిస్తారు.

ఈ నెల 18న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28 నుంచి రైతు బంధు సొమ్మును బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రైతుబీమా, పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం,రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈనేపథ్యంలోనే రేపటి నుంచి రైతు బంధు సొమ్ము పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Read Also… President South Sojourn: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు.. వాయిదాకి కారణం అదేనా!