CM KCR Review: కరోనా ఉధృతిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కీలక ఆదేశాలు జారీ..!

|

Apr 24, 2021 | 12:04 PM

కరోనా నుంచి కోలుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌... వైరస్‌ ఉధృతిపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై సమీక్షించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM KCR Review: కరోనా ఉధృతిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కీలక ఆదేశాలు జారీ..!
Cm Kcr
Follow us on

CM KCR Medical Department Review: కరోనా నుంచి కోలుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌… వైరస్‌ ఉధృతిపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై సమీక్షించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల దగ్గర ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలన్న ఆయన… ఆక్సిజన్‌ను సైనిక విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకొస్తున్నామన్నారు. అవసరమైన ఆస్పత్రులకు ఆక్సిజన్‌ అందించాన్నారు. సీఎం కేసీఆర్‌ కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల కొరత ఏర్పడకుండా చూడాలన్నారు.

దేశంలో అక్కడక్కడ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వేసవి కాలం కావడంతో పాటు అన్ని ఆసుపత్రులు కరోనా పేషంట్లతో నిండి ఉన్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

ముఖ్యంగా కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న గాంధీ, టిమ్స్ లాంటి పేషంట్లు ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్‌ను అందరికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధ విమానాలను ఉపయోగించుకుంటున్నామన్న సీఎం.. ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్‌కి చేరే విధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకొనే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా పెరగింది. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని మన రాష్ట్రానికి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సూచించారు. కిట్స్‌ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మానిటర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని లక్షల మందికి అయినా హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించడానికి వీలుగా కిట్స్‌ను సమకూర్చాలని సీఎం ఆరోగ్య శాఖను ఆదేశించారు.

Read Also…  మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ అవినీతి కేసు, దాడులు