Modi vs KCR: ప్రధాని మోదీ వర్సెస్‌ సీఎం కేసీఆర్‌.. ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరుగుతుందా..? పెంచుతున్నారా?

|

Apr 30, 2022 | 8:40 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగిపోయిందనే చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది.

Modi vs KCR: ప్రధాని మోదీ వర్సెస్‌ సీఎం కేసీఆర్‌.. ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరుగుతుందా..? పెంచుతున్నారా?
Kcr Modi
Follow us on

Telangana CM KCR vs PM Narendra Modi:  భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగిపోయిందనే చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది. వరుసగా ప్రధాని కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు సీఎం కేసీఆర్‌. అయితే దీనికి కారణం ఏంటి ? ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ణయం వల్లే ఇలా జరుగుతోందా? లేక కేసీఆర్‌ కావాలనే మోదీ మీటింగ్‌లను దూరం పెడుతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహపూరిత వాతావరణం అభివృద్ధికి దోహదం చేస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో గానీ, కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం చాలా అవసరం. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మధ్య సఖ్యత కొరవడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీనికి కారణం ఏంటి ?. ప్రధాని మీటింగ్‌లకి హాజరు కాకుండా కేంద్రం జాగ్రత్త చర్యలు తీసుకుందా ? లేక సీఎం కేసీఆర్‌ కావాలనే ప్రధాని మోదీ మీటింగ్‌లకి హాజరు కావడం లేదా ? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ ప్రొటోకాల్‌ని ఉల్లంఘిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం కరోనా ఫోర్త్‌ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలని వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు ప్రధాని మోదీ. అయితే ఈ వీడియోకాన్ఫరెన్స్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. తాజాగా ఢిల్లీలో మరో కీలక సమావేశం జరిగింది. CJI జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్‌ హాజరు కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ సదస్సుకు హాజరయ్యారు.

అంతేకాదు ఇటీవల హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సందర్శనకు ప్రధాని మోదీ వచ్చిన కార్యక్రమానికి కూడా కేసీఆర్‌ హాజరు కాలేదు. దీంతో గత మూడు నెలలుగా ప్రధాని మోదీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. అయితే భారత్‌ బయోటెక్‌ సందర్శనకు వచ్చిన సమయంలో ప్రధాని కార్యాలయం రావొద్దని స్పష్టమైన సందేశం పంపించిందని ఇటీవల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అయితే, కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ దీనికి కౌంటర్‌ ఇచ్చారు. ప్రధాని కార్యాలయం అలాంటి సందేశం పంపలేదన్నారు. సీఎం కేసీఆర్‌ అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోతున్నారని సీఎం కార్యాలయం నుంచే పీఎంవోకు సమాచారం వచ్చిందని ట్వీట్‌ చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యక్రమాలకు తప్ప ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదంటున్నారు బీజేపీ నేతలు. మొన్న కరోనాపై ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి, ఇప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్ట్‌ ప్రధాని న్యాయమూర్తి నేతృత్వంలో జరిగిన న్యాయ సమీక్ష సమావేశాన్ని ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ ఎందుకు హాజరు కావడం లేదనేది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.

Read Also….  TV9 Digital News Round Up: ఓటీటీలో ఆచార్య స్ట్రీమింగ్‌ | బిగ్ బాస్ షో హైకోర్టు ఆగ్రహం..