Chillies Price: మిర్చి ధరలు ఢమాల్‍.. కేవలం రెండు రోజుల్లోనే కన్నీరు మిగిల్చిన ఎర్రబంగారం

|

Apr 13, 2023 | 12:08 PM

వ్యాపారులు దుర్భుద్దితో ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే క్వింటాలుకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు ధర తగ్గింది. పచ్చళ్ల కంపెనీలు ఎక్కువగా వాడే దేశీ, సింగిల్‍పట్టి మిర్చి క్వింటాల్‍కు ఏకంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధరలు పడిపోయాయి..

Chillies Price: మిర్చి ధరలు ఢమాల్‍.. కేవలం రెండు రోజుల్లోనే కన్నీరు మిగిల్చిన ఎర్రబంగారం
Chillies Price
Follow us on

వరంగల్‍ ఏనుమాముల మార్కెట్లో బుధవారం మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. క్వింటాల్​కు రూ.5 వేల వరకు తగ్గిపోయాయి. రెండు రోజుల క్రితం మంచి ధర ఉందని రైతులు మార్కెట్‌కు పంట తీసుకువచ్చారు. కానీ వ్యాపారులు దుర్భుద్దితో ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే క్వింటాలుకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు ధర తగ్గింది. పచ్చళ్ల కంపెనీలు ఎక్కువగా వాడే దేశీ, సింగిల్‍పట్టి మిర్చి క్వింటాల్‍కు ఏకంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధరలు పడిపోయాయి. ఏనుమాముల మార్కెట్‍కు రైతులు బుధవారం 35 వేల మిర్చి బస్తాలు తీసుకొచ్చారు. మంగళవారం వచ్చినవాటిలో 7నుంచి 8 వేల బస్తాలు మిగిలిపోగా.. మొత్తంగా దాదాపు 40 వేల బస్తాలు మర్కెట్‌లో ఉన్నాయి. వ్యాపారులు ధరలు తగ్గించడం చూసి లభోదిభోమన్నారు. సోమ, మంగళవారాలతో పోలిస్తే క్వింటాల్‍ మిర్చి ధర గరిష్ఠంగా రూ. 5 వేల వరకు తగ్గించడంతో ఆందోళన చెందారు. రెండు రోజుల ముందు యూఎస్‍ 341 రకం క్వింటాల్​రూ. 22,700 పలకగా బుధవారం నాడు రూ.17 వేల నుంచి రూ.17,500లు మాత్రమే ధర చెల్లిస్తామన్నారు. తేజ మిర్చి క్వింటాల్‍ 16,500కి తగ్గించారు. దేశీ రకం క్వింటాల్​రూ. 75 వేల నుంచి రూ.80 వేల వరకు పలకగా.. బుధవారం రూ.50 వేలకు పడిపోయింది. సింగిల్‍ పట్టి రూ. 65 వేల నుంచి రూ. 40 వేలకు పడిపోయింది.

మంగళ, బుధవారాల్లో తేజ, యూఎస్‍ -341 రకం జెండా పాట దాదాపు రూ. 22,700 నుంచి రూ.21,200 నడిస్తే.. వ్యాపారులు మాత్రం రైతులకు కేవలం 16,500 నుంచి రూ.18వేల వరకే ధర కట్టించారు. ఖమ్మం ఏఎంసీ మార్కెట్లో తేజ మిర్చికి మంగళవారం రూ. 24,500 జెండా పాట పెట్టారు. ధర బాగుండటంతో బుధవారం పెద్ద సంఖ్యలో రైతులు పంటను మార్కెట్​కు తీసుకువచ్చారు. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేటయ్యి జెండా పాట ధర రూ. 1,400 తగ్గించి రూ.23,100 గా నిర్ణయించారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఆశగా పంటను అమ్ముకోడానికి వచ్చిన రైతులకు కన్నీరే మిగిలింది. కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కావాలనే సిండికేట్‍గా మారి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. క్వాలిటీ లేదని, మిర్చికి మచ్చ ఉందని సవాలక్ష సాకులు చూపి వ్యాపారులు ఘోరంగా రేటు తగ్గిస్తున్నారు. మరోవైపు బస్తాకు 49 కిలోల నిబంధనతో తమ కష్టార్జితాన్ని ఆగం చేస్తున్నారని రైతు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.