Kcr-Modi: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం గం. 5.00 సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన్ను ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రధానికి తెలిపారు. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ, పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని చెప్పినట్టుగా తెలిసింది.
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం శంఖుస్థాపన కోసం ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్, తన పర్యటనను పొడిగించుకుని మరీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 10 వేర్వేరు అంశాలపై ఆయనకు లేఖలు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై సైతం ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలిసింది. గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ మేరకు అందులో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ప్రాజెక్టులు కాకుండా, రెండు నదుల పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే కృష్ణా నది జలాల వాటాల విషయంలోనూ తెలంగాణ వాదన మరోలా ఉంది. కొత్తగా మళ్లీ వాటాలు లెక్కించాల్సిందేనని, ఈ మేరకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. అప్పటి వరకు కృష్ణా జలాలను చెరి సగం వినియోగించుకోవాలని తెలంగాణ సీఎం ప్రతిపాదించారు. వీటన్నింటిపై ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే సీఎం కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనల్లో వీటి ప్రస్తావన లేదు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రికి విన్నవించిన వివరాల జాబితా ఇదే..
ఐపీఎస్ క్యాడర్ పెంచండి..
రాష్ట్రంలో గతంలో 9 పోలీసు జిల్లాలుండగా, ఆ సంఖ్య ప్రస్తుతం 20కి పెరిగిందని, గతంలో 2 పోలీసు కమిషనరేట్ల నుంచి 9 కమిషనరేట్లకు, 4 పోలీసు జోన్ల నుంచి, 7 జోన్లకు పెరిగిందని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా 2 పోలీసు మల్టీజోన్లు కూడా ఏర్పాటయ్యాయి అని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, జోన్ ఐజీల సంఖ్య పెరగాల్సి ఉంటుందని, అందుకే ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 2016లో ఈ అంశంపై సమీక్షించిన కేంద్ర హోంశాఖ 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు మొత్తం 139 పోస్టులను మంజూరు చేసిందని, అయితే పెరిగిన అవసరాల రీత్యా సీనియర్ డ్యూటీ పోస్టులను 76 నుంచి 105కు పెంచుతూ, మొత్తం పోస్టులను 195 పోస్టులకు పెంచాలని తెలంగాణ సీఎం ప్రధానిని కోరారు.
కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు..
పరిపాలన సౌలభ్యంతో పాటు పాలన వికేంద్రీకరణలో భాగంగా 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల కసరత్తు చేసిందని, గతంలో 12,500 చ.కి.మీ వైశాల్యం, 35 లక్షల జనాభా ప్రాతిపదికన 9 రూరల్ జిల్లాలు ఉండగా, ఇప్పుడు 4,750 చ.కి.మీ వైశాల్యం, 12 లక్షల జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారు. ఈ క్రమంలో కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 9 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలున్నాయని, కొత్తగా ఏర్పాటైన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజమాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ (రూరల్), జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్‌లో టెక్స్ టైల్ పార్క్..
పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా తెలంగాణలో తాము ‘టీఎస్-ఐపాస్’ పేరుతో పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రధానికి సీఎం కేసీఆర్ తెలిపారు. తాము ప్రవేశపెట్టిన పాలసీతో పెట్టుబడులకు, పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతియేటా 60 లక్షల బేళ్ల ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే పత్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ద్వితీయ స్థానంలో నిలిచిందని అన్నారు. జౌళి రంగంలో పెట్టుబడులకు వరంగల్ నగరానికి విస్తృతమైన అవకాశముందని, అక్కడ 2,000 ఎకరాల్లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే 1,000 ఎకరాలు ఇప్పటికే సేకరించినట్టు చెప్పారు. జౌళి రంగంలో వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు, సింథటిక్ టెక్స్‌టైల్స్ వంటి అధునాత వస్త్రాలు సహా ఇందులో సరికొత్త టౌన్‌షిప్, నివాస భవన సముదాయాలు, ఇతర మౌలిక వసతులన్నింటినీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ పార్కు కోసం గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద కేంద్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లు ఇవ్వాలని కోరారు. మిగతా ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
సెంట్రల్ యూనివర్సిటీలో ఐఐఎం..
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యాసంస్థను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుందని, అయితే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మంజూరు చేయలేదని సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రికి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ఉన్నందున ఐఐఎం మంజూరు చేయడం లేదని, నిజానికి ఐఎస్‌బీ అనేది లాభాపేక్షలేని ఓ ప్రైవేటు విద్యాసంస్థ అని, ఇందులో కోర్సులన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఉంటాయని, భారీ మొత్తంలో ఉండే ట్యూషన్ ఫీజులను సామాన్యులు భరించలేరని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిందేనని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో 2,000 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉందని సీఎం తెలిపారు. అక్కడ ఐఐఎంను వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కరీంగనర్‌లో ట్రిపుల్ ఐటీ..
ఉత్తర తెలంగాణలో ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు. పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్య పద్ధతిలో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కరీంనగర్ పట్టణం హైదరాబాద్ నగరానికి 165 కి.మీ దూరంలో ఉంటుందని, జాతీయ రహదారి, రైల్వే లైన్‌తో అనుసంధానమై ఉందని తెలిపారు. ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలంతో పాటు ఏర్పాటుకు అయ్యే ఖర్చులో వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుందని వెల్లడించారు.
గ్రామీణ రహదారుల వెడల్పు పెంచండి..
ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకానికి అర్హత కల్గిన 4,000 కి.మీ మేర రహదారులు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఎం కేసీఆర్ ప్రధానికి తెలిపారు. అర్హత కల్గిన అన్ని రహదారుల వెడల్పును ప్రస్తుతమున్న 3.75 మీటర్ల నుంచి 5.5 మీటర్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడి ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయడం కోసం అదనపు నిధులివ్వాలని, ఆ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అదనపు నిధులు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకు నిధులు..
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద 60 శాతం నిధులను అందజేస్తోందని, నిజానికి మావోయిస్టుల సమస్య దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి, ఇక్కడ రోడ్లకు అవసరమయ్యే నిధుల్లో 60 శాతానికి బదులు పూర్తిగా 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని సీఎం కేసీఆర్ ప్రధానికి సూచించారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని ఆయన అందజేశారు.
ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94, షెడ్యూల్ 13(3) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి గుర్తుచేశారు. ఈ మేరకు వరంగల్ సమీపంలోని ములుగు జిల్లా జాకారం వద్ద 200 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను కేంద్ర విద్యాశాఖకు అందజేశామని అన్నారు. వీలైనంత త్వరగా అక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేలే కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు.
హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వద్ద ప్రారంభమై తెలంగాణలోని హైదరాబాద్ వద్ద ముగిసేలా మొత్తం 585 కి.మీ పొడవైన హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రితో చర్చించారు. ఈ ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్‌ను హైస్పీడ్ రైల్వే కనెక్టివిటీతో పాటు ప్రస్తుతమున్న జాతీయ రహదారి 44ను 6-8 వరుసలుగా విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని సీఎం తెలిపారు. ఇది నాగ్‌పూర్-హైదరాబాద్ రైల్వే లైన్‌లో భాగంగా ఉంటుందని, అలాగే హైదరాబాద్ – భూపాలపట్నం జాతీయ రహదారిలో భాగంగా ఉంటుందని వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ – నాగ్‌పూర్, వరంగల్ – హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. ఢిల్లీ – ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ల తరహాలో వీటిలో ఇంటిగ్రేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్స్ ఏర్పాటు చేయడానికి అనుకూల పరిస్థితులున్నాయని, వీటిలో అన్ని రకాల మౌలిక వసతులతో పాటు స్వయం సమృద్ధిగల ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్, చక్కని రోడ్డు, రైలు కనెక్టివిటీ, తగినంత విద్యుత్తు సరఫరా సదుపాయాలు ఉన్నాయని వివరించారు.
తెలంగాణ భవన్ కు స్థలం కేటాయించండి..
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన విద్యాసంస్థలు, అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా అధికారిక భవనం ‘తెలంగాణ భవన్’ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి మోదీని కోరారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఆ క్రమంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి కూడా స్థలాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో అనువైన చోట స్థలాన్ని కేటాయించాలని కోరగా, అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆశోక్ రోడ్‌లోని భవనంలో విభజన చట్టంలో సూచించినట్టు 58:42 నిష్పత్తిలో పంపకాలు జరుపుకుంటే వచ్చే స్థలం ఎలాగూ ఉంటుంది. తద్వారా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి రెండు భవనాలు నిర్మించుకునే వెసులుబాటు కలగనుంది.
Also read:
Coconut Oil Health Benefits: కొబ్బరి నూనె 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..!