Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోండి – కేంద్ర అటవీ శాఖ మంత్రికి తెలంగాణ బీజేపీ విజ్ఞప్తి

రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై రాజకీయంగా దుమారం రేగుతోంది. భూముల వేలాన్ని ఉపసహంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. దీనిపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ నేతల బృందం.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి లేఖను అందజేసింది. తాజాగా తెలంగాణ బీజేపీ నేతలు.. కేంద్ర పర్యావరణం, అడవుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరిట లేఖను అందజేశారు.

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోండి - కేంద్ర అటవీ శాఖ మంత్రికి తెలంగాణ బీజేపీ విజ్ఞప్తి
Telangana BJP against Kancha Gachibowli land issue

Updated on: Apr 01, 2025 | 9:34 PM

కంచ గచ్చిబౌలి గ్రామంలో ప్రభుత్వం వేలం వేయదలిచిన భూమిలో.. దట్టమైన చెట్లు, గడ్డి భూములు, వృక్ష సంపద, సరస్సులతో కూడిన అడవి ఉందని బీజేపీ ఎంపీలు కేంద్ర అటవీ శాఖ మంత్రికి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు అడవిలో ‘పుట్టగొడుగుల శిలలుగా’ పేరొందిన  ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు ఉన్నాయని ప్రస్తావించారు. దాదాపు 237 జాతుల పక్షులు, నెమళ్ళు, మచ్చల జింకలు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్ రాక్ పైథాన్ వంటి వాటికి ఈ అటవీ ప్రాంతం ఒక ముఖ్యమైన పర్యావరణ ఆవాసం అని లేఖలో రాసుకొచ్చారు. అడవి లక్షణాలను కలిగి ఉన్న అన్ని ప్రాంతాలు.. “డీమ్డ్ ఫారెస్ట్స్” జాబితాలోకే వస్తాయని.. 12.12.1996 న గౌరవనీయ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఉందని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమి రెవెన్యూ లేదా అటవీ రికార్డులలో అధికారికంగా అడవిగా వర్గీకరించబడనప్పటికీ.. దాని లక్షణాలు, పర్యావరణ విలువ ఆధారంగా అటవీ ప్రాంతంగా బేరీజు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గౌరవనీయ సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టం ప్రకారం, కాంచా గచ్చిబౌలి గ్రామంలో ఉన్న 400 ఎకరాల భూమి డీమ్డ్ ఫారెస్ట్‌గా అర్హత పొందిందని లేఖలో పొందుపరిచారు. అందువల్ల ఆ భూమి అటవీ సంరక్షణ చట్టం 1980 కింద రక్షిత పరిధిలోకి వస్తుందని ఎంపీలు కేంద్రం అటవీ శాఖ మంత్రికి ఇచ్చిన లేఖలో ప్రధానంగా హైలెట్ చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) అక్కడ లే అవుట్ వేసి.. వృక్షసంపదను చట్టవిరుద్ధంగా తొలగించడం ప్రారంభించిందని ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్రం… కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి పొందలేదని లేఖలో పేర్కొన్నారు. అడవిని తొలగించి లేఅవుట్ అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించే ముందు పర్యావరణానికి ఎంతో మేర హాని జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని అటవీ సంపదను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌‌ను.. బీజేపీ ఎంపీల బృందం అభ్యర్థించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.