BJP Fight: తెలంగాణ బీజేపీలో ముదిరిన ముసలం.. తగ్గేదిలే అంటున్న అసమ్మతి నేతలు!

|

Jan 19, 2022 | 4:14 PM

తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది.! సీక్రెట్‌ మీటంగ్‌తో బయటపడ్డ కుమ్ములాటలు..అక్కడితోనే ఆగేలాలేవు.! ఎవరూ తగ్గడం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగానే దూకుడుగా వెళ్తున్నారు.

BJP Fight: తెలంగాణ బీజేపీలో ముదిరిన ముసలం.. తగ్గేదిలే అంటున్న అసమ్మతి నేతలు!
Ts Bjp
Follow us on

Telangana BJP leaders internal fight: తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది.! సీక్రెట్‌ మీటంగ్‌తో బయటపడ్డ కుమ్ములాటలు..అక్కడితోనే ఆగేలాలేవు.! ఎవరూ తగ్గడం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగానే దూకుడుగా వెళ్తున్నారు. ఇంద్రసేనారెడ్డి రాయబారమూ విఫలమైనట్లే కనిపిస్తోంది. మరి నెక్స్ట్‌ ఏంటి? కరీంనగర్‌ అడ్డాలో కమలం బిడ్డలు ఎందుకు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు.? ఆరా తీసిన అధిష్టానానికి అంతర్గతంగా ఉన్న అసలు కుమ్ములాటలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణ బీజేపీకి మంచి పట్టున్న జిల్లా కరీంనగర్.! ఇక్కడి నుంచి పార్లమెంటు సభ్యులుగా గెలిచిన బండి సంజయ్ కుమార్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా చక్రం తిప్పుతున్నారు. తెలంగాణలో రెండో అతిపెద్ద పార్టీగా పరుగులు పెట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే జిల్లా నుంచి ధిక్కారస్వరాలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అది కూడా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా. సీనియర్లంతా ఏకమయ్యారు.! రహస్య మీటింగ్‌ పెట్టుకున్నారు. తమకు ఎదురైన అవమనాలు, ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నారు. ఏం చేయాలనేది చర్చించుకున్నారు. ఇది కాస్తా బండి సంజయ్‌కు తెలియడం.. హైకమాండ్‌కు ఫిర్యాదులు చేయడం..వాళ్ల సంగతేంటో తేల్చండి అంటూ.. ఇంద్రసేనారెడ్డిని బరిలోకి దింపడం ఇదంతా జరిగిపోయిన ఎపిసోడ్. అయితే అసలు సినిమా ఇప్పుడే మొదలవుతోంది.

అసంతృప్త నేతల్ని హైదరాబాద్‌ పిలిపించి మాట్లాడారు బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి. నెక్ట్స్‌ అంతా సర్దుకుంటుందిలే అనుకున్నారంతా. కానీ, అలా జరగడం లేదు. సీనియర్లంతా ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు.. ఏం జరిగిందన్నది లీకులిస్తున్నారు. అంతేకాదు షోకాజు నోటీసులిస్తే సమాధానం చెబుతామంటున్నారు. ఇండైరెక్ట్‌గా బండిసంజయ్‌ను టార్గెట్ చేస్తున్నారు. తమ సీనియార్టీ, నిబద్ధత హైకమాండ్‌కు తెలుసని గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు తమకు ఎదురైన అవమానాల చిట్టానూ విప్పుతున్నారు. త్వరలోనే మరో మీటింగ్ ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు.

కరీంనగర్‌ బీజేపీలో కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు కొత్తేంకాదు. ఒక్కసారి గతంలోకి వెళ్లి చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావు ఉన్నప్పటినుంచే వర్గపోరు ఓ రేంజ్‌లో నడిచేది. విద్యాసాగర్‌రావు… గుజ్జుల రామకృష్ణారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఈ వార్‌ చాలా రోజులు కంటిన్యూ అయింది. 2014 ఎలక్షన్ల సమయంలో పార్టీ బండి సంజయ్, రామకృష్ణారెడ్డి గ్రూప్‌లుగా విడిపోయింది.. 2014, 18 ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి MLAగా పోటీ చేసి ఓడిపోయారు బండి. దీనికి రామకృష్ణారెడ్డే కారణమన్నది బండి సంజయ్‌వర్గం వాదన. అయితే 2019లో బండి సంజయ్ MPగా గెలవడం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. అప్పటి నుంచి ఈ రెండు గ్రూప్‌ల మధ్య గ్యాప్‌ బాగా పెరిగింది. అటు రాష్ట్ర కమిటీతోపాటు.. జిల్లా కమిటీలోనూ రామకృష్ణారెడ్డి వర్గానికి చోటు దక్కలేదు. ఇదిగో అప్పటి నుంచి ఇంటర్నల్‌గా వార్ జరుగుతూనే ఉంది. పూర్తిగా పక్కనపెట్టడంపై రామకృష్ణారెడ్డి వర్గం రగిలిపోతోంది. RSSకు కూడా ఫిర్యాదు చేసింది. ఇదిగో ఇప్పుడు సీక్రెట్‌ మీటింగ్‌ నిర్వహించడం ద్వారా ఓ రకంగా తిరుగుబాటు జెండా ఎగరేసింది.

మరో వైపు, బండి సంజయ్‌ కూడా గతాన్ని తవ్వుతున్నారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ల లిస్ట్‌ తయారు చేస్తున్నారట. అప్పుడు చూసీ చూడనట్లు ఉన్నా, ఇకపై మాత్రం చర్యలు తీసుకోవాల్సిందేనన్నది సంజయ్ పంతంగా కనిపిస్తోంది. మొత్తంగా ఇది తెలంగాణ బీజేపీలో బీటలా? దూసుకెళ్తాంమనుకున్న టైమ్‌లో స్పీడ్ బ్రేకరా? చివరికి మంతనాలు, రాయబారాలతో మ్యాటర్ సమసిపోతుందా? ఇవన్నీ బీజేపీ క్యాడర్‌ నుంచే ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు.. మరీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో నిలదొక్కుకోవాలనుకుంటున్న పార్టీ అసమ్మతి రాగం ఎటువైపు దారితీస్తుందోనని సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆందోళన చెందుతున్నారు.

Read Also….అటవీశాఖ కార్యాలయంలో లక్షల విలువైన శ్రీగంధం చెక్కలు మాయం.. ఉన్నతాధికారుల దర్యాప్తులో కొత్త ట్విస్ట్..