తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. ఈ క్రమంలోనే గురువారం కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ వంటి పెద్దలు ఈ సభకు హాజరయ్యారు. పత్రికల్లో కూడా ఈ సభ గురించి ప్రచారం గట్టిగా చేశారు. ఈ ప్రచార ప్రకటన ప్రజంట్ నెట్టింట్ వైరల్‌గా మారింది. అందులో ‘కరీంనగర్’, పేరును కరినగర్ అని పేర్కొన్నారు. ఆంగ్ల దినపత్రికలతో పాటు తెలుగు పత్రికల్లోనూ ఇలానే ముద్రణ ఉంది. మొదట్లో ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అని భావించారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. జిల్లాను వేరే పేరుతో ప్రచురించడం వెనుకు బీజేపీకి ఉద్దేశపూర్వక ఎత్తుగడ ఉన్నట్లే తెలుస్తుంది.
గతంలో నిజాం పరిపాలించాడు కాబట్టి జిల్లాల పేర్లన్నీ దాదాపు ముస్లిం పేర్లకు సారూప్యంగా ఉన్నాయి. ‘కరీంనగర్’ కూడా అలానే ‘కరీం’ అనే ముస్లిం పేరు ప్రతిబింబించే విధంగా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే హైదరాబాద్‌తో సహా ముస్లిం ఛాయలున్న అన్ని జిల్లాల పేర్లను మార్చుతామని బీజేపీ పదే, పదే చెబుతూ వస్తుంది. ప్రజంట్ అయితే ఓ అడుగు ముందుకు వేసి.. ‘ఛలో కరినగర్’ అని దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. సో.. వ్యూహాత్మకంగానే బీజేపీ ఈ పేరును మార్చి ప్రకటన ఇచ్చినట్లు అర్థమవుతుంది.
‘కరీంనగర్’లో ‘కరీం’ అనేది ముస్లిం పేరు ఉంది. అదే ‘కరినగర్’ అని పిలిస్తే.. ‘కరి’ అంటే ఏనుగు కాబట్టి.. ఇలా ఫిక్సయినట్లు తెలుస్తుంది. అంతేకాదు వాడుక భాషలో జిల్లాలోని వృద్ధులు చాలామంది ఇప్పటికీ ‘కరినగరం’ అని సంభోధిస్తారట. గతంలో ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా సంచరించడంతో ఆ పేరుతో పిలిచేవారని కొందరు అంటున్నారు. సో బీజేపీ పక్కాగా ఆలోచించాక, నిపుణుల నుంచి అభిప్రాయం తీసుకున్నాకే ఈ పేరు ఫిక్సయ్యారని సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..