Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో నా టికెట్‌పై కూడా స్పష్టత లేదు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు తిప్పుకుంటున్నారని, తిప్పుకున్న వారికి, తిరిగిన వారికి.. ఇద్దరికీ టికెట్లు రావని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తేల్చి చెప్పారు.

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో నా టికెట్‌పై కూడా స్పష్టత లేదు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Bandi Sanjay
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:45 PM

Bandi Sanjay:  పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని భారతీయ జనతా పార్టీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర(Praja Sangram Padayatra) ముందు బండి సంజయ్ మీడియా చిట్ చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ముఖ్యమంత్రులవుతామని ముందస్తుగా చెప్పుకునే వారు మంత్రులు కూడా కాలేరని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ తన టికెట్‌పై కూడా స్పష్టత లేదని ఖరాఖండిగా చెప్పారు. యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్న వారికి టికెట్‌ రాలేదని బండి సంజయ్‌ పునరుద్ఘాటించారు. వ్యక్తుల కోసం పనిచేసే వారికి టికెట్లు రావన్నారు. టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు తిప్పుకుంటున్నారని, తిప్పుకున్న వారికి, తిరిగిన వారికి.. ఇద్దరికీ టికెట్లు రావని తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సంతోష్‌ కూడా ఇదే విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారని తెలిపారు.

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కుట్ర ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈనెల 14 నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలో రెండో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. ఇటీవల పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈనెల 7 నుంచి 20 వరకు ‘సామాజిక న్యాయ పక్షం’ పేరుతో చేపట్టే కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రైతు సదస్సులు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో చర్చించారు.

తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. రైతుల ముసుగులో టీఆర్ఎస్ నేతలు దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాలని బండి సంజయ్‌ సూచించారు. సీఎం ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులతో భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని సంజయ్ స్పష్టం చేశారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వ నియంత.. అవినీతి.. కుటుంబ పాలనను పూర్తి స్థాయిలో ఎండగడతామని బండి సంజయ్‌ తెలిపారు.

Read Also…  Bihar CM Nitish Kumar: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ సభలో బాంబు పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం