Telangana Elections: బుజ్జగింపులతో దారికొస్తున్న నేతలు.. అయినా అభ్యర్థుల్లో టెన్షన్!

కాంగ్రెస్ పార్టీ... అసమ్మతి, అసంతృప్త నేతలకు పెట్టింది పేరు. ఇక ఎన్నికలు ఉన్నాయంటే నేతల అలకలు మాములుగా ఉండవు. అసలే ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధిష్టానం తొలి జాబితా ప్రకటించడంతో అసంతృప్త సెగలు రగిలాయి. దీంతో ఆలస్యమైన అసంతృప్త నేతలను బుజ్జగించడంలో కాంగ్రెస్ సఫలీకృతం అవుతోంది. ముఖ్యంగా తొలి జాబితాలో ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్ దక్కని అసమ్మతిని ఓ కొలిక్కి తెచ్చారు.

Telangana Elections: బుజ్జగింపులతో దారికొస్తున్న నేతలు.. అయినా అభ్యర్థుల్లో టెన్షన్!
Congress

Edited By: Balaraju Goud

Updated on: Oct 24, 2023 | 7:23 AM

కాంగ్రెస్ పార్టీ… అసమ్మతి, అసంతృప్త నేతలకు పెట్టింది పేరు. ఇక ఎన్నికలు ఉన్నాయంటే నేతల అలకలు మాములుగా ఉండవు. అసలే ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధిష్టానం తొలి జాబితా ప్రకటించడంతో అసంతృప్త సెగలు రగిలాయి. దీంతో ఆలస్యమైన అసంతృప్త నేతలను బుజ్జగించడంలో కాంగ్రెస్ సఫలీకృతం అవుతోంది. ముఖ్యంగా తొలి జాబితాలో ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్ దక్కని అసమ్మతిని ఓ కొలిక్కి తెచ్చారు. ఒక్కో నేతను తిరిగి పార్టీతో మమేకం చేస్తున్నారు. మిలిగిన నేతలను సైతం దారికి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ టికెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్ ఆశావహులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లో హస్తం పార్టీలో ఒక్కసారిగా అలజడి రేగింది. కొందరు పార్టీ పట్ల బహిరంగంగా తమ నిరసనను వ్యక్తం చేస్తే మరికొందరు అధిష్టానం ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఏకంగా గాంధీ భవన్ ముందు మద్దతుదారులతో పడిగాపులు కాశారు. టికెట్ ఇస్తే గానీ పార్టీకి అండగా ఉండలేమని పట్టుబట్టారు.

ఈ క్రమంలోనే కొల్లాపూర్ లో చింతపల్లి జగదీశ్వర్ రావు, నాగర్ కర్నూల్ లో నాగం జనార్ధన్ రెడ్డి, కల్వకుర్తిలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, గద్వాల్ లో పటేల్ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో చింతపల్లి జగదీశ్వర్ రావు పార్టీ జెండాలు, పోస్టర్లు చించేసి నిరసన తెలిపారు. పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు. మరునాడే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి టికెట్ సైతం పొందాడు జగదీశ్వర రావు. మరోవైపు గద్వాల్‌లో టికెట్ దక్కపోవడంతో పటేల్ ప్రభాకర్ రెడ్డి ఏకంగా పార్టీని వీడి అధికార బీఆర్ఎస్ పార్టీ లో చేరిపోయారు. కల్వకుర్తిలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాగైనా బరిలో ఉండాలని ఇతర పార్టీల వైపు చూసాడు. అనుచరులు, కార్యకర్తలతో విస్తృత సమావేశాలు సైతం నిర్వహించాడు.

అయితే వీరిలో పార్టీ వీడిన జగదీశ్వర రావును బుజ్జగింపులు సఫలికృతమయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం నేతలు జగదీశ్వర రావుతో చర్చలు జరిపి భవిష్యత్ లో తగిన అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ లో కొనసాగుతానని స్పష్టం చేశారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇక కల్వకుర్తిలో సుంకిరెడ్డి తోను పార్టీ అధిష్టానం నేతల చర్చలు విజయవంతమైనట్లు తెలుస్తోంది. మొదట్లో ఉన్న అసంతృప్తి ప్రస్తుతం కనిపించడం లేదని అనుచరులు చెపుతున్నారు. అలాగే ప్రత్యేకంగా సమావేశాలు సైతం నిలిపివేశారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఇక నాగర్ కర్నూల్ లో నాగం జనార్ధన్ రెడ్డితో ఇప్పటికే పలు దఫాలుగా కాంగ్రెస్ పెద్దలు సంప్రదింపులు జరిపారు. ఆయన కూడా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు చోట్ల అసమ్మతి ఉంటే రెండు చోట్ల సద్దుమణిగినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. త్వరలోనే నాగం సైతం హస్తం పార్టీ కోసం పని చేస్తారని ఆశాభావంతో ఉన్నారట. దీంతో మెజారిటీగా అసమ్మతికి కళ్లెం వేసినట్లేనని భావిస్తున్నారు. ఇక త్వరలో వెలువడనున్న రెండో జాబిత కంటే ముందే వీరిని సైలెంట్ చేయాలని చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..