Telangana Election: రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. మరోసారి అధికారుల్లో మొదలైన గుబులు!

| Edited By: Balaraju Goud

Nov 01, 2023 | 9:04 PM

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ చూస్తున్న కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలు సడెన్‌గా విజిట్ చేశారు. నామినేషన్ ప్రక్రియకు రెండు రోజులకు ముందు రాష్ట్రానికి ఒకరోజు పర్యటనకు రావడం హాట్‌టాపిక్‌గా మారింది.

Telangana Election: రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. మరోసారి అధికారుల్లో మొదలైన గుబులు!
Central Election Team
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ఒక రోజు పర్యటించింది. ఉదయం ఎన్నికల ప్రధానాధికారితో మొదలైన సమావేశాలు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ముగించింది. ఎన్నికల నిర్వహణ, రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే, కటినమైన చర్యలు తప్పవని బృందం హెచ్చరించింది.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ చూస్తున్న కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలు సడెన్‌గా విజిట్ చేశారు. నామినేషన్ ప్రక్రియకు రెండు రోజులకు ముందు రాష్ట్రానికి ఒకరోజు పర్యటనకు రావడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై రాష్ట్ర CEO, సీఎస్, డీజీపీలతో సమీక్షలు నిర్వహించారు. మూడో తేదీ నుంచి జరిగే నామినేషన్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు సెంట్రల్ ఎన్నికల బృందం సభ్యులు. ముఖ్యంగా అఫిడవిట్ అంశంలో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఇక, అభ్యర్థులపై వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, ఫిర్యాదులు, ఓటర్ల నమోదు ప్రక్రియ, జిల్లాల్లో అధికారుల పనితీరు తదితర అంశాలపై నితీష్ వ్యాస్ బృందానికి వివరించారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సల తో భేటీ అయిన సెంట్రల్ టీం నగదు, మద్యం కట్టడిపై సమీక్ష చేశారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 400కోట్ల విలువగల సొత్తును అన్ని రకాలుగా కలిసి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు ఆయా శాఖల ఉన్నతాధికారులు. అధికారుల వివరణ అయ్యాక వర్క్ స్పీడ్ మరింత పెంచాలని, చెక్ పోస్టుల వద్ద అవసరమైతే మరింత భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు ECI టీం.

ఇక రాష్ట్రంలో నోడల్ అధికారుల అంశంలో సమీక్ష చేశారు. నోడల్ అధికారి వ్యవస్థ చాలా కీలకమైంది అని అన్నారు. ఇక మధ్యాహ్నం తరువాత సీఎస్ శాంతకుమారి, డీజీపీ అంజనీ కుమార్‌తో విడివిడిగా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా దాదాపు 15నిమిషాల చొప్పున సమావేశం అయ్యారు కేంద్ర ఎన్నికల అధికారులు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, గత పది రోజుల నుంచి జరిగిన అంశాలు, దుబ్బాక ఘటనను ఉదహరిస్తూ ఆరా తీశారట సెంట్రల్ టీం. అదే విధంగా సీఎస్‌తో జరిగిన భేటీలో ఆయా జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులపై వస్తున్న ఫిర్యాదుల విషయాన్ని ఆరా తీసినట్లు సమాచారం. ఇక ఆన్ గోయింగ్ స్కీమ్స్‌పై కూడా పలు వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. గత నెల కేంద్రం బృందం వచ్చిన వారంలోపే అధికారుల భారీ కుదుపు జరిగింది. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయో అనే భయం అధికారుల్లో మొదలైందట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…