నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం. అందుకే.. ఓటు అనే విలువైన ఆయుధాన్ని.. ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం విలువను వివరిస్తూ.. ఓటు ప్రాధాన్యతను గుర్తించాలని ప్రచారం చేస్తున్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఓటు నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నవంబర్ 21, మంగళవారం నాడు ఓ వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 91 ఏళ్ల అన్నపూర్ణ చుండూరి తన ఇంటి వద్దే ఓటు వేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం భారత ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా మొదటి ఓటరు అయ్యారు. ఎన్నికల అధికారులు, పోలీసులు ఆమె నివాసానికి పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకెళ్లారు.
ఇంటింటికి ఓటింగ్ సౌకర్యం నవంబర్ 27 వరకు అందుబాటులో ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ సేవను వినియోగించుకోవడానికి, ఓటర్లు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజుల్లో ఫారం 12-డిని ఉపయోగించి రిటర్నింగ్ అధికారి (RO)కి దరఖాస్తును సమర్పించారు. ఇందుకు 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వైకల్యం ఉన్న వ్యక్తులు, అవసరమైన సేవల్లోని ఉద్యోగులు సేవకు అర్హులు.
ఈసారి మొత్తం 28 వేల 57 మందికి ఇంటి దగ్గరే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44 వేల 97 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత ఉన్న 28 వేల 57 మందికి అవకాశం కల్పించారు. 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు, ఇతరత్రా కారణాలతో నడవలేని స్థితిలో ఉన్నవారు ఇలా ఇంట్లోంచే ఓటు వెయ్యొచ్చు. ఇందుకోసం D-12 ఫామ్ సమర్పించారు. దాన్ని BLOలు చెక్‌చేసి ఇంటి నుంచే ఓటు వేయడంపై నిర్ణయం తీసుకుంటారు.
అర్హులైన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకునేలా సేవలో భాగంగా ఇద్దరు పోల్ వర్కర్లు ఇంటింటికీ వెళ్తారు. తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి. ఐతే.. ఈలోపే హోమ్ ఓటింగ్ జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు అధికారులు వెళ్లి ఓటు వేయిస్తున్నారు..హోమ్ ఓటింగ్ నమోదు అయిన తర్వాత ఇతర ఓట్లతో కలిపి డిసెంబర్ 3న లెక్కించడం జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ ఓటింగ్ ప్రక్రియ గోప్యతంగా నిర్వహిస్తున్నట్లు, మొత్తం ఓటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేసి, రిటర్నింగ్ అధికారులకు సమర్పించడం జరగుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసేందుకు ఇలా చేస్తున్నారు. ఇదిలావుంటే తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…