
హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం (హిల్ట్ పాలసీ)పై శాసనసభలో వాడీవేడీగా చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చలో భాగంగా ఈ విధానంపై అధికారిక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారడంతో, ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సభా వేదికగా స్పష్టమైన కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హిల్ట్ విధానంపై బీఆర్ఎస్, బీజేపీలు వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, విధాన పరమైన అవసరంగా చూపించడమే అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది.
నగర నడిబొడ్డులోకి వచ్చిన పరిశ్రమలు
హిల్ట్ అవసరమని ప్రభుత్వ వాదన
ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన అనేక పారిశ్రామిక వాడలు ఇప్పుడు నగర నడిబొడ్డులోకి వచ్చేశాయని ప్రభుత్వం చెబుతోంది. జనాభా పెరుగుదలతో పాటు నివాస ప్రాంతాలు విస్తరించడంతో, పరిశ్రమల వల్ల వాయు, ధ్వని, జల కాలుష్యం పెరుగుతోందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో రెడ్, ఆరెంజ్ జోన్ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది కొత్త ఆలోచన కాదని, గతంలోనే హైకోర్టు కూడా పరిశ్రమల తరలింపుపై సూచనలు చేసిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఈ అంశంపై కసరత్తు జరిగిన విషయాన్ని సభ ముందు ఉంచాలని యోచిస్తోంది.
హిల్ట్ పాలసీ లక్ష్యాలు ఇవే
హిల్ట్ విధానం ద్వారా నగరాన్ని కాలుష్యరహితంగా మార్చడం, వినియోగంలో లేని పారిశ్రామిక భూములను సద్వినియోగంలోకి తేవడం, వాణిజ్య కార్యకలాపాలకు కొత్త అవకాశాలు కల్పించడం, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం చెబుతోంది. పరిశ్రమల స్థానంలో వాణిజ్య భవనాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నివాస సముదాయాలు ఏర్పడితే నగర అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నది ప్రభుత్వ వాదన.
అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ విధానంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల భూములను తక్కువ ధరలకు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారని, జోన్ మార్పిడిలో రిజిస్ట్రేషన్ విలువలో 30 నుంచి 50 శాతం మాత్రమే వసూలు చేసి లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.
పరిశ్రమల వర్గాల్లో మిశ్రమ స్పందన
పారిశ్రామిక వర్గాల్లో హిల్ట్ పాలసీపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద పరిశ్రమలకు ఇది కొంతవరకు అనుకూలంగా ఉన్నా, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు మాత్రం భారంగా మారుతుందని కొందరు అంటున్నారు. పరిశ్రమను నగర బయటకు తరలించడం అంత సులభం కాదని, ఉద్యోగులను కొత్త ప్రాంతాలకు తీసుకెళ్లడం మరింత కష్టమని వారు చెబుతున్నారు. చాలా మంది ఉద్యోగులు పరిశ్రమల చుట్టుపక్కలే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, నగరం వెలుపలికి మారితే అక్కడికి రావడానికి ఆసక్తి చూపరని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. దీంతో నైపుణ్యం కలిగిన కార్మికులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూసేసిన పరిశ్రమలకు మాత్రం అవకాశం
ఇప్పటికే కార్యకలాపాలు నిలిపివేసిన లేదా కాలం చెల్లిన పరిశ్రమల యజమానులకు మాత్రం హిల్ట్ పాలసీ ఒక అవకాశంగా మారింది. మంచి ధర రాక అమ్మలేని భూములను ఇప్పుడు వాణిజ్యపరంగా వినియోగించుకునే వెసులుబాటు లభిస్తోందని వారు భావిస్తున్నారు. ఈ భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు నిర్మించి ఆదాయం పొందాలని యోచిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పరిశ్రమల తరలింపును కొంతమేర స్వాగతిస్తున్నారు. కాలుష్యం తగ్గడమే కాకుండా, కొత్త వ్యాపారాలు, మార్కెట్లు ఏర్పడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.
ఎంతమంది హిల్ట్ వైపు మొగ్గు చూపుతారు?
ప్రస్తుతం హైదరాబాద్‌లోని 22 పారిశ్రామిక వాడల్లో హిల్ట్ పాలసీపై విస్తృత చర్చ జరుగుతోంది. పెద్ద రోడ్ల పక్కన స్థలాలున్న వారు వాణిజ్య వినియోగం వైపు ఆసక్తి చూపుతున్నా, చిన్న రోడ్ల వెంబడి ఉన్న పరిశ్రమల యజమానులు మాత్రం జోన్ మార్పిడి ఫీజులు చెల్లించే స్థితిలో లేరని తెలుస్తోంది. నాచారం, చర్లపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అన్ని పరిశ్రమలను తరలిస్తే వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. భూ వినియోగ మార్పిడితో కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దానికి స్పష్టమైన విధాన మార్గదర్శకాలు అవసరమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అసెంబ్లీ చర్చే కీలకం
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో జరగనున్న చర్చతో అనేక అనుమానాలకు సమాధానం లభిస్తుందా, లేక వివాదం మరింత ముదిరుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం ప్రకటించబోయే వివరాలు, ప్రతిపక్షాల కౌంటర్‌లు ఈ విధానం భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.