Revanth VS Sabitha: అక్కాతమ్ముడు అంటూ అధికార – ప్రతిపక్ష నేతల ఫైర్ వార్.. రెండో రోజు అదే సీన్!
అక్కాతమ్ముళ్ల పంచాయితీ.. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకాస్త దూకుడు పెంచారు. అక్కలకు గౌరవం ఇస్తున్నానంటూనే.. కౌంటర్లు కూడా గట్టిగా వేశారు. కేవలం సబితను మాత్రమే టార్గెట్ చేయలేదు. మొత్తం బీఆర్ఎస్ సభ్యులపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి.
అక్కాతమ్ముళ్ల పంచాయితీ.. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకాస్త దూకుడు పెంచారు. అక్కలకు గౌరవం ఇస్తున్నానంటూనే.. కౌంటర్లు కూడా గట్టిగా వేశారు. కేవలం సబితను మాత్రమే టార్గెట్ చేయలేదు. మొత్తం బీఆర్ఎస్ సభ్యులపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి.
అక్కాతమ్ముడు అంటూ అధికార ప్రతిపక్ష నేతల ఫైర్ వార్.. తెలంగాణ అసెంబ్లీలో మరో రోజు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ తమ్మున్ని నమ్ముకున్నారు.. అక్కలు మంత్రులు అయ్యారు. ఆ అన్నలను నమ్ముకున్నారు.. ఓ చెల్లెలు జైలుకెళ్లారు. సింపుల్‌గా చెప్పాలంటే.. గురువారం సభలోని సారాంశం ఇదీ. రెండ్రోజులుగా జరుగుతోందీ అక్కాతమ్ముళ్ల మధ్య మాటయ యుద్ధం. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి.. ఇద్దరూ బయటి వ్యక్తులు కాదు. ఒక కుటుంబ సభ్యులే. అందుకే కాబోలు అంతలా రగులుతోంది. ఇంటి పోరు ఇంతింత కాదయా అని ఆనాడు వేమన అన్నది కూడా ఇందుకేనేమో. ప్రతిపక్షం క్షమాపణ డిమాండ్ చేయడమేమో గానీ.. మరోసారి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. కాకపోతే.. ఈసారి ఫస్ట్ టార్గెట్ సబిత ఇంద్రారెడ్డి కాదు. బీఆర్ఎస్ సభ్యులపై. ఆడబిడ్డలను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ సభ్యులపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి.. మెల్లగా మరోసారి ‘అక్కలపై’ టాపిక్ తీసుకొచ్చారు. బుధవారం సభలో తనలోని ఆవేదనను ఒక పార్ట్ వరకే చెప్పుకున్నట్టున్నారు ముఖ్యమంత్రి. గురువారం నాడు సెకండ్ పార్ట్‌కు తెరతీశారు. మాజీ మంత్రులు సబితను గాని, సునీత లక్ష్మారెడ్డిని గానీ.. ఇప్పటికీ సొంత అక్కలుగానే భావిస్తున్నానంటూనే కౌంటర్లు వేశారు. ఇక్కడే.. అసలైన డైలాగ్‌కు తెరలేచింది. ఈ తమ్ముడిని నమ్ముకున్నందుకు మంత్రులయ్యారు, ఆ అన్నలను నమ్ముకున్నందుకు ఏమయ్యారో చూస్తున్నారంటూ ఘాటుగానే సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
అంతకుముందు బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ వీడడాన్ని తప్పు పట్టారు. సబితా ఇంద్రారెడ్డి గత హయాంలో కాంగ్రెస్ వదిలి BRS లో చేరడం వల్ల తను సీఎల్పీ కాలేకపోయానని అసెంబ్లీలోనే చెప్పారు. అక్కడితో ఆగకుండా ఇంకా ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చావు అని సబితను అనడంతో ప్రతిపక్షం భగ్గుమంది. వెంటనే నిరసన చేపట్టింది. భట్టి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టింది. అంతలో సభలోకి వచ్చిన సీఎం.. ఇదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ తాను కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సబితా ఇంద్రారెడ్డి కారణమని, తనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీగా నామినేషన్ వేసే సమయానికి ఆమె బీఆర్ఎస్‌లోకి వెళ్లారని కామెంట్ చేశారు. అంతేకాకుండా సభలోనే ఉన్న సునీత లక్ష్మారెడ్డి పేరు ప్రస్తావిస్తూ సునీత ప్రచారానికి వెళ్తే కేసులు కూడా అయ్యాయని.. కానీ తన ప్రచారం సమయానికి ఆమె గులాబీ కండువా కప్పుకుందని అన్నారు. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అంటూ సీఎం చేసిన కామెంట్స్ మరోసారి వివాదాస్పరంగా మరాయి.దీనిపై నిన్న సభ ముగిసే వరకు సభలోనే నిరసన తెలియజేశారు ప్రతిపక్ష సభ్యులు.
ఇక గురువారం ఉదయం కూడా సబితా ఇంద్రారెడ్డికి మైక్ ఇవ్వాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు ఎంఐఎం కూడా సబితకు మాట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరింది. కానీ కేవలం సభలో జరుగుతున్న బిజినెస్ పై మాట్లాడటానికి మాత్రమే అవకాశం ఇస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో పోడియం వద్ద నిరసన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత ముఖ్యమంత్రి చాంబర్ ముందుకు వచ్చి బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ లో వదిలిపెట్టారు. అసెంబ్లీ ముగిసే వరకు వరకు అసెంబ్లీలోనే ఉండి పోడియం ముందు నాలుగున్నర గంటలు నిల్చోని నిరసన తెలియజేశారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు. అయినా స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
ఇక ఉదయం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సబిత. తను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం వల్లనే సీఎం అయ్యావు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అక్క వాళ్ళనే మంచి జరిగిందని గుర్తు చేశారు. అయితే తెలంగాణ ఆడపడుచులను కించపరిచిన భట్టి అందుకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఇక శుక్రవారం కూడా బీఆర్ఎస్ ఇదే అంశంపై అసెంబ్లీలో నిరసన కంటిన్యూ చేయాలని భావిస్తుందట. అవసరమైతే మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చి.. సభను స్తంభించేలా ఆందోళన చేయాలని ఫ్లాన్ చేస్తుందట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..