Dharani website : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలుండటంతో రైతులు వివరాలు నమోదు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘ధరణి’ వెబ్‌సెట్ ప్రారంభంలో కొంత ఇబ్బందులు తలెత్తినా.. రోజులు గడుస్తున్నా కొద్ది అధికారులు దాన్ని మరింత విస్తృతపరుస్తున్నారు. భూ లావాదేవీలకు సంబంధించి అన్ని వ్యవహారాలను ‘ధరణి’ ద్వారా చేపడుతున్న అధికారులు.. తాజాగా మరో అవకాశాన్ని కల్పించారు.
పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదైన తర్వాత వాటిని సరి చేసుకునేందుకు ఇప్పటివరకు అవకాశం లేకపోగా తాజాగా 9 రకాల సవరణలకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అందులో కొన్నింటి పరిష్కారానికి ఆప్షన్లు కూడా ఇచ్చింది. అందులో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. ఆధార్ నమోదులో తప్పులు, ఆధార్ వివరాలు సమర్పించకపోవడం, తండ్రి లేదా భర్త పేరులో తప్పులు, కులం మార్పు, సర్వే నంబర్ మిస్సింగ్, పాస్ పుస్తకాల్లో భూమి రకం మార్పు లాంటి అంశాలకు ఆప్షన్లు ఇచ్చింది. కొత్త పాస్ పుస్తకాల మంజూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో రాష్ట్రంలోని మీ–సేవ కేంద్రాలకు వెళ్లి సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థనలు జిల్లా కలెక్టర్ల వద్దకు వెళుతాయాని వారు చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓకే చేయడం, లేదా తిరస్కరించడం జరగుతుందన్నారు. అనంతరం అన్ని సవ్యంగా ఉన్న దారఖాస్తలను పరిశీలించి వారికి ఇంటిమేషన్ అందిస్తామని పేర్కొన్నారు. అయితే ఇంకా ధరణిలో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అమల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు, కంపెనీలకు పాసుపుస్తకాల జారీ ప్రక్రియ, లీజు బదిలీ, రద్దు, సరెండర్, అమ్మకపు సర్టిఫికెట్లు, కన్వేయన్స్ డీడ్ విస్తీర్ణంలో తేడాలు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లకు, మైనర్లకు పాసు పుస్తకాల్లాంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. త్వరలోనే వీటికి కూడా పరిష్కరం సూచిస్తామని అధికారులు వెల్లడించారు.