
సత్యసాయి జిల్లా, ఆగస్టు 27: పద్నాలుగేళ్ల బాలిక ముఖ్యమంత్రి కార్యాలయానికి మెయిల్ ద్వారా తనకు బాల్య వివాహం చేస్తున్నారని సమాచారం ఇచ్చింది. తనకు ఇష్టం లేకపోయినా ఆధార్ కార్డులో వయస్సు మార్పు చేసి పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారని మైనర్ బాలిక సీఎంఓకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. సీఎంఓ ప్రతి చిన్న ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంటుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వెంటనే సంబంధిత జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చి… బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా తిమ్మమ్మమర్రిమాను గ్రామానికి చెందిన మైనర్ బాలిక (14) ఎన్పీకుంట మండల పరిషత్ పాఠశాలలో చదువుకుంటోంది. మైనర్ బాలిక (14) తండ్రి తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని, అందుకోసం తన ఆధార్ కార్డులో వయస్సుని మార్పు చేసి వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను చదువుకుంటాను అని ఎంత చెప్పినా వినకుండా ఇవాళ (27-08-23) వివాహానికి ఏర్పాట్లు చేశాడని మెయిల్ ద్వారా సీఎంఓ కార్యాలయానికి సమాచారం చేరవేసింది. తక్షణమే స్పందించిన సీఎంఓ కార్యాలయం ఆ పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా ఎస్పీకి పంపారు.
సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీఓ ఆదినారాయణ, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ఐసీడీఎస్ అధికారులు బాలిక స్వగ్రామానికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులు, వరుడు కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక ఇష్టం మేరకు తల్లిదండ్రుల వద్దనే ఉంటూ విద్యను కొనసాగించాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. బాల్య వివాహం చేస్తున్నారని తెలిసి ధైర్యంగా తండ్రిని ఎదిరించి అధికారులకు విషయం తెలియజేసిన మైనర్ బాలిక తెగువను స్థానికులు అభినందించారు. ప్రస్తుతం చదువుకుంటానని మేజర్ అయ్యాకే పెళ్ళి చేసుకుంటానని తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.