Former Minister Mohammed Fareeduddin: మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ నేత మొహమ్మద్ ఫరీదుద్దీన్ (64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఫరీదుద్దీన్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. సొంతగ్రామం హోతి (బి) గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మైనారిటీ సంక్షేమ శాఖ, సహకార శాఖ మంత్రిగా వైఎస్ ప్రభుత్వంలో పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2016లో టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఫరీదుద్దీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.