సర్కార్ బడిని కాపాడాలనే తపన.. డప్పు భుజానేసుకుని ఊరంతా తిరిగిన పంతులు..!

విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం పొంచి ఉండడంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడం కోసం పంతుల్లకు వింత వేషాలు తప్పడంలేదు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి డెడికేషన్ ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది.

సర్కార్ బడిని కాపాడాలనే తపన.. డప్పు భుజానేసుకుని ఊరంతా తిరిగిన పంతులు..!
Teacher Makes Public Announcement

Edited By:

Updated on: Jun 11, 2026 | 3:17 PM

విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం పొంచి ఉండడంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడం కోసం పంతుల్లకు వింత వేషాలు తప్పడంలేదు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి డెడికేషన్ ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది.

మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసిన వినూత్న ప్రచారం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భుజానికి డప్పు వేసుకుని గ్రామ వీధుల్లో తిరుగుతూ “ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ బడి ముద్దు” అంటూ దరువేస్తూ తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నారు.

గూడూరు మండలం పాటిమీదిగూడెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వి. గోపినాథ్ ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు విద్యార్థుల సంఖ్యను కూడా పెంచాలనే లక్ష్యంతో ఆయన ఈ వినూత్న ప్రచారం చేపట్టారు. సాధారణంగా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం కాకుండా, గ్రామస్తుల దృష్టిని ఆకర్షించేలా డప్పు కొడుతూ ఊరంతా ర్యాలీ నిర్వహించారు.

డప్పు దరువుతో గ్రామంలోని ప్రతి వీధిని చుట్టేసిన గోపినాథ్, ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు, నాణ్యమైన బోధన వంటి అంశాలను వివరించారు. ప్రైవేట్ పాఠశాలల కోసం అధిక ఫీజులు చెల్లించి ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్య అందుబాటులో ఉందని వారికి వివరించారు.

అంతేకాకుండా గ్రామ బొడ్రాయి వద్ద గ్రామస్తులు, వారి పిల్లలతో కలిసి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఉపాధ్యాయుడి పిలుపుతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తామని ప్రమాణం చేశారు. “ఇకపై మా పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించం.. ప్రభుత్వ బడిలోనే చదివిస్తాం” అంటూ గ్రామస్తులంతా ఏకగ్రీవంగా ప్రతిజ్ఞ చేయడం విశేషంగా నిలిచింది.

వీడియో ఇక్కడ చూడండి…

గోపినాథ్ కృషికి ఇప్పటికే ఫలితాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం కేవలం ముగ్గురు విద్యార్థులతో కొనసాగుతున్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 16 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒక ఉపాధ్యాయుడు తన విధులను మాత్రమే నిర్వర్తించకుండా, ప్రభుత్వ విద్యను కాపాడాలనే సంకల్పంతో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. డప్పు దరువుతో బడిబాట పట్టిన గోపినాథ్ ప్రయత్నం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు స్ఫూర్తిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉపయోగపడతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us