
Telangana: చదువు చెప్పాల్సిన చేతులే.. పసి విద్యార్థి పై దాడి చేశాయన్న ఆరోపణలు జోగిపేటలో కలకలం రేపుతున్నాయి.1 నుంచి 30 వరకు అంకెలను సరిగా చెప్పలేదన్న కారణంతో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దాడిలో విద్యార్థి వీపు భాగంలో తీవ్ర గాయాలు అయినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పై ఆగ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మరింత ముదిరింది.
అయితే చివరకు ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగింది అంటే సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ మీడియంలో మూడో తరగతి చదువుతున్న అర్హయ్(8)పై ఉపాధ్యాయుడు దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 1 నుంచి 30 వరకు అంకెలను సరిగా చెప్పలేదనే కారణంతో విద్యార్థిని కొట్టినట్లు చెబుతున్నారు. టీచర్ దాడి కారణంగా విద్యార్థి వీపు భాగంలో గాయాలైనట్లు గుర్తించిన తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న వెంటనే ఆందోళనకు గురయ్యారు. నిన్న రాత్రి విద్యార్థిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
విద్యార్థికి చికిత్స చేయించిన అనంతరం తల్లిదండ్రులు జోగిపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో విషయం పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి వెళ్లింది. అయితే కేసు పెట్టకుండా సమస్యను పాఠశాల స్థాయిలోనే పరిష్కరించుకునేందుకు కొందరు ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులతో చర్చలు జరిపినట్లు సమాచారం. చివరకు ఘటన పై ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. అయితే పాఠశాలలో విద్యార్థులపై శారీరక దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి. చిన్నపిల్లలను భయపెట్టి చదువు చెప్పడం కాకుండా.. వారికి అర్థమయ్యేలా, ఓర్పుతో విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి