పోలీసుల ఆధీనంలో తాటిగూడ కాలనీ.. తాత్కాలిక ఔట్ పోస్ట్ ఏర్పాటు.. 24 గంటలు గస్తీ..

ఆదిలాబాద్ జిల్లాలో తాటిగూడలో ఎంఐఎం నేత ఫారుఖ్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ బాధితులకు నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. కాగా బాధితుల్లో

పోలీసుల ఆధీనంలో తాటిగూడ కాలనీ.. తాత్కాలిక ఔట్ పోస్ట్ ఏర్పాటు.. 24 గంటలు గస్తీ..

Updated on: Dec 20, 2020 | 11:19 AM

ఆదిలాబాద్ జిల్లాలో తాటిగూడలో ఎంఐఎం నేత ఫారుఖ్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ బాధితులకు నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. బాధితుల్లో జమీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అతని కడుపు, వీపు భాగంలోని బుల్లెట్లను తొలగించామన్నారు. ప్రస్తుతం అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మరో యువకుడు మొతీషిన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

మరోవైపు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్‌ కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫారుఖ్ వినియోగించిన తుపాకీ లైసెన్స్ గడువు ముగిసినట్లుగా పోలీసులు తేల్చారు. నవంబర్ 15వ తేదీతోనే గన్ లైసెన్స్ ముగిసిందన్నారు. అప్పటి నుంచి గన్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోలేదన్నారు. ఇక ఆదిలాబాద్ వ్యాప్తంగా 54 మందికి అధికారికంగా గన్స్ ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో 11 మంది ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. కాగా, లైసెన్స్‌డ్ గన్‌తో భయబ్రాంతులకు గురిచేశారని నలుగురు వ్యక్తులపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

ఇదిలాఉండగా, ఆదిలాబాద్‌లోని తాటిగూడ కాలనీ పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. కాల్పుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు. తాత్కాలిక అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి 24 గంటలు గస్తీ కాస్తున్నారు.