
తెలంగాణలో ఎక్కడ చూసినా గ్రామ సర్పంచ్ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వ్ అయింది. ఈ గ్రామానికి చెందిన 95 ఏళ్ల గుంటకండ్ల రామ చంద్రారెడ్డి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామ చంద్రారెడ్డి. రాష్ట్రంలో అత్యధిక వయస్సు కలిగిన సర్పంచ్ పదవి అభ్యర్ధిగా రికార్డులకు ఎక్కారు. యువత రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్న సమయంలో.. తనకు వయసుతో సంబంధం లేదని, యువకుల కంటే ఎక్కువ ఉత్సాహంగా నేను పనిచేస్తానని 95 ఏళ్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.. వయస్సు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని అంటున్నారు. ఆది నుంచి సామాజిక సేవ చేసే నేపథ్యం కలిగిన కుటుంబమని పేర్కొన్నారు. ఈ వయసులో కూడా చాలా చక్కగా, తన పని తాను చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు.. ప్రజా సేవ చేయాలనే తపన ఉందని.. అందుకే.. గ్రామాభివృద్ది కోసం.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
గ్రామంలో తొలి ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి భవనాలను రామచంద్రారెడ్డి కుటుంబీకులే నిర్మించారు. గ్రామస్తులతో రామచంద్రారెడ్డి. రైతుగా, టీచరుగా.. వైద్యుడిగా గ్రామస్తులతో మమేకమయ్యారు. అనేక సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టారు.. గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ… ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టేందుకు ఎన్నికలకు వెళ్తున్నానని రామచంద్రారెడ్డి చెబుతున్నారు.. సతీమణి సుశీల ఫౌండేషన్ తరపున గ్రామంలో అనేక కార్యక్రమాలను చేపట్టారని.. గ్రామాభివృద్ధిలో రామచంద్రారెడ్డి కీలక పాత్ర ఉందని, ఇక ఎన్నిక లాంఛనమేనని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..