NV Ramana – Telugu: సినిమాల్లో తెలుగు భాష తన ఔన్నత్యాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ. నటీనటులు, గాయకులు తెలుగు భాష ఉచ్ఛారణ సరిగా నేర్చుకుని నటిస్తే, పాడితే బాగుంటుందని సూచించారు. అంతేకాదు ఆంగ్లభాష నేర్చుకుంటేనే ఉపాధి లభిస్తుందనే అపోహను తొలగించాలన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ఘంటసాల శతజయంతి వేడుకల్లో పాల్గొన్న జస్టిస్ ఎన్‌వి రమణ.. తెలుగు భాష ఔన్నత్యంపై ప్రసంగించారు. తెలుగు ప్రశస్థాన్ని పొగడుతూనే.. తెలుగు భాష నిరాధరణకు గురవుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు భాష తన ప్రాభవాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో తెలుగును సరిగా ఉచ్ఛరించడం లేదన్నారు. ఇప్పుడు నటిస్తున్న నటీనటులు, గాయకులకు తెలుగు భాష ఉచ్ఛారణ సరిగా రావడం లేదన్నారు. తెలుగు భాష రాకపోతే అవమానంగా భావించవద్దని, నేర్చుకుని సరి చేసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. సినిమా దర్శకులు, నటీనటులు, గాయకులు దీన్ని గమనించాలని సూచించారు. ఒక తెలుగు వ్యక్తిగా ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నానన్నారు. తాను సినిమాల్లోని పాటలు, సాహిత్యం ద్వారా ఎంతో స్ఫూర్తి పొందానని తెలిపారు. దేశభక్తి గీతాలు వింటే ఎవరైనా ఉద్వేగానికి లోనవుతారని తెలిపారు. చరిత్రను మళ్లీ కళ్లకు కట్టినట్టు చూపించాలన్నా, వినిపించాలన్న సినిమా మాధ్యమం బలమైందన్నారు. అందుకే సినిమాల్లో తెలుగు భాష ఉచ్ఛారణ బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. బతికినంత కాలం పాడాలని, పాడినంత కాలం బతకాలని కోరుకున్న ఘంటసాల శతజయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ.
అంతేకాదు ఆంగ్లభాషలో చదివితేనే ఉపాధి లభిస్తుందనే ఆపోహను కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు జస్టిస్ ఎన్‌వి రమణ. తాను కూడా డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదివానని, కేవలం లా మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదివానని చెప్పారు. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలుగు పద్యాలు, సాహిత్యం నేర్పించాలని సూచించారు. తెలుగు భాషను బతికించాలంటే అందరూ తమ వంతుగా పాటుపడాలని సూచించారు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్.
Also read:
Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..
Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం