
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను విస్మరించే సంతానంపై కొరడా ఝులిపించేందుకు ప్రభుత్వం చట్టం చేసింది. అయినా.. కన్న వారి పట్ల కొడుకుల తీరులో మార్పు కనిపించడం లేదు. కాయకష్టం చేసి తల్లిదండ్రులు సంపాదించిన భూములను పట్టా చేయించుకుని పట్టెడన్నం పెట్టడం లేదు. అయితే ఆ వృద్ధ దంపతులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజపురం గ్రామానిక చెందిన మారోజు ఓంకారం, ఈశ్వరమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు ఉన్నారు. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకులను చదివించి.. పెళ్లిళ్లు కూడా చేశారు. కొడుకులు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. అయితే ఈ వృద్ధ దంపతులు మాత్రం ఊరిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. 2019లో మారోజు ఓంకారం పేరిట ఉన్న 5-20 ఎకరాల భూమిని ఐదుగురు కుమారులకు సమానంగా పంచి పట్టా చేయించి ఇచ్చారు. కేవలం తల్లి ఈశ్వరమ్మ పేరిట ఉన్న ఎకరం భూమి మాత్రమే ఉంది.
ఇదిలావుంటే, తల్లిదండ్రుల జీవనోపాధికి ఏటా ప్రతి ఒక్కరూ ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కొడుకులు నిర్ణయించారు. అనుకున్న ప్రకారం నలుగురు కొడుకులు.. తల్లిదండ్రులకు డబ్బులు చెల్లిస్తుండగా, పెద్దకొడుకు నరసయ్య మాత్రం ఇవ్వడం లేదు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన వృద్ధ దంపతులను ఏ కొడుకు పట్టించుకోవడం లేదు. దీంతో ఓంకారం, ఈశ్వరమ్మ దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొడుకులను సంప్రదించగా తమకు ఎటువంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు.
దీంతో కలెక్టర్ ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు, వైద్య సిబ్బంది బాధిత వృద్ధ దంపతుల వద్దకు వచ్చి వైద్య పరీక్షలు చేయించి వారి బాగోగులు తెలుసుకున్నారు. తమను పట్టించుకోని కొడుకులు మా ఆస్తిని అనుభవించే అర్హత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుల పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా అధికారులను వృద్ధ దంపతులు వేడుకున్నారు. తమ బాగోగులు ఎవరూ చూడకుంటే ఏ అనాథ ఆశ్రమానికైనా, వృద్ధాశ్రమానికైనా రాసిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకులను పిలిపించి తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..