డేంజర్ జోన్ వరకు మట్టి తొలగింపు.. చివరి దశకు చేరుకున్న SLBC టన్నెల్ ఆపరేషన్..!

రోజులు గడుస్తున్నాయి.. వారాలు మారుతున్నాయి. నెలలు పూర్తవుతున్నాయి. SLBC రెస్క్యూ ఆపరేషన్‌ మాత్రం కొలిక్కిరావడం లేదు. ఇంకా ఆరుగురి ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు సహాయక బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. ప్రమాద ఘటనలో రిసీవ్ ఆపరేషన్ వేగవంతమైంది. లోకోమోటివ్ సహాయంతో బండ రాళ్లను తొలగించే ప్రక్రియ వేగవంతం చేశారు.

డేంజర్ జోన్ వరకు మట్టి తొలగింపు.. చివరి దశకు చేరుకున్న SLBC టన్నెల్ ఆపరేషన్..!
Slbc Update

Edited By: Balaraju Goud

Updated on: Apr 17, 2025 | 8:12 PM

రోజులు గడుస్తున్నాయి.. వారాలు మారుతున్నాయి. నెలలు పూర్తవుతున్నాయి. SLBC రెస్క్యూ ఆపరేషన్‌ మాత్రం కొలిక్కిరావడం లేదు. ఇంకా ఆరుగురి ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు సహాయక బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. ప్రమాద ఘటనలో రిసీవ్ ఆపరేషన్ వేగవంతమైంది. లోకోమోటివ్ సహాయంతో బండ రాళ్లను తొలగించే ప్రక్రియ వేగవంతం చేశారు.

SLBC టన్నెల్‌లో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. టన్నెల్లో విధులు నిర్వహించడానికి కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు 50 మంది లోపలికి వెళ్లగా ప్రమాదం జరిగిన వెంటనే అతి కష్టం మీద 42 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ఎనిమిది మంది లోపల చిక్కుకుపోయారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోని సహాయక చర్యలు మొదలయ్యాయి. మార్చి 9న పంజాబ్‌కు చెందిన మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్, మార్చి 25న యూపీకి చెందిన కంపెనీ ఇంజినీర్ మనోజ్ కుమార్ మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన ఆరుగురి కోసం కేంద్ర, రాష్ట్రాలకు చెందిన 12 సంస్థల రెస్క్యూ సిబ్బంది నిరంతరం అన్వేషణ చేస్తున్నారు. మృతదేహాలను వెలికి తీయడమే లక్ష్యంగా రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. కానీ ఆరుగురి మృతదేహాల జాడమాత్రం తెలియడం లేదు.

ఈ నేపథ్యంలోనే బుధవారం(ఏప్రిల్ 16) టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎస్‌డిఆర్‌ఎఫ్, దక్షిణ మధ్య రైల్వే, జేపీ కంపెనీ ప్రతినిధులు, హైడ్రా, అధికారులు, సహాయక బృందాల ఉన్నతాధికారులతో కొనసాగుతునర్న సహాయకచర్యలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడ అంతరాయం లేకుండా కొనసాగించాలని ఆయన సూచించారు.

కాగా రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుందని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సింగరేణి మట్టిని తవ్వే కార్యక్రమం ముందుకు సాగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సమన్వయంతో సహాయక చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన యంత్రాల ద్వారా, టన్నెల్ నిర్మాణంలో నిష్ణాతులైన అధికారుల సూచనలు, సలహాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని శివశంకర్ చెప్పారు.

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన రోజు నుండి నిర్విరామంగా టన్నెల్‌లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇంకా 50 మీటర్ల పొడవు,3 మీటర్ల ఎత్తు మేర సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. సొరంగం లోపల ఎస్కావేటర్లు, బాబ్ క్యాట్లు,పెద్ద బండ రాళ్లను తొలగిస్తూ, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టన్నెల్ బయటకు తరలిస్తున్నట్లు తెలిపారు. కత్తిరించిన టిబిఎం భాగాలను లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి పంపుతున్నట్లు తెలిపారు.

డీవాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలపై నివేదికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి వివరించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..