TSPSC Paper Leak: సీఎం కేసీఆర్ సీరియస్.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం

|

Mar 18, 2023 | 9:49 PM

సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రవీణ్, రాజశేఖర్‌లతో పాటు మొత్తం 9మంది నిందితుల్ని చంచల్‌గూడ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు.

TSPSC Paper Leak: సీఎం కేసీఆర్ సీరియస్.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం
Tspsc
Follow us on

సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రవీణ్, రాజశేఖర్‌లతో పాటు మొత్తం 9మంది నిందితుల్ని చంచల్‌గూడ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి తరలించిన అధికారులు.. కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోకి ప్రవీణ్‌, రాజశేఖర్‌లను తీసుకెళ్లారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కంప్యూటర్లను హ్యాక్ చేసి సమాచారాన్ని ఎలా దొంగిలించారో అడిగి తెలుసుకున్నారు. అలాగే టెక్నికల్ విషయాలపైనా సిట్ ఆరా తీసింది. లీక్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్, రాజశేఖర్, రేణుకల నుంచి సిట్ అధికారులు మరింత సమాచారం సేకరించారు. వారిని వేర్వేరుగా ప్రశ్నించి వివరాలు రాబట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్‌లో భాగంగా.. వాళ్ల మొబైల్ ఫోన్స్‌కు సంబంధించిన డేటాను కూడా విశ్లేషించినట్టు తెలుస్తోంది.

టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్.. సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్‌లు గత అక్టోబరు నుంచి పలు పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. అయితే ప్రవీణ్‌, రాజశేఖర్‌లిద్దరూ విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రవీణే పాస్‌వర్డ్ ఇచ్చాడని రాజశేఖర్‌ చెబుతుంటే.. శంకర్‌ లక్ష్మి డైరీలో పాస్‌వర్డ్‌ దొంగిలించానని సిట్‌కు వివరించాడు ప్రవీణ్‌. శంకర్‌ లక్ష్మి మాత్రం అసలు డైరీలో పాస్‌వర్డ్‌ లాంటివేవీ రాయలేదన్నారు. దీంతో ప్రవీణ్‌, రాజశేఖర్‌లు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు అధికారులు నిర్దారణకు వచ్చారు. మరోవైపు పేపర్లు ఎలా లీక్ అయ్యాయో సైబర్ నిపుణులకు కూడా అంతుచిక్కడం లేదని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ సీరియస్..

లీక్‌ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ సీరియస్ అయ్యారు. ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి సీఎస్‌ శాంతి కుమారి, మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డిలు హాజరయ్యారు. పేప‌ర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ తదుపరి కార్యాచరణపై చర్చించారు.

పేపర్ లీకేజీపై ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగించింది బీజేపీ. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఖమ్మంజిల్లాలో ధర్నాకు దిగిన బీజేపీ శ్రేణులు.. నిజామాబాద్‌, కరీంనగర్‌లో కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..