స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్..S.I.B అడ్డాగా మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అండ్ టీమ్ మాములు కథ నడపలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు తెరపైకి వచ్చాయి. ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైడ్ యాంగిల్‌లో ఎంక్వయిరీ చేస్తున్నారు. డే 1 విచారణకు ప్రణీత్‌రావు అంతగా స్పందించలేదని తెలుస్తోంది. రెండో రోజు బంజారాహిల్స్ పీఎస్‌లో ప్రణీత్‌రావును ప్రశ్నించారు పోలీసులు. కూపీలాగిన కొద్దీ ఖథర్నాక్ సంచలనాలు క్యూ కడుతున్నాయి.
ప్రమోషన్లను ఎరగా వేసి ఆరుగురు సభ్యులతో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న ప్రణీత్..వారి ద్వారా వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసినట్టు విచారణలో తేలింది. ఎస్‌ఐ బీ ఆఫీసులో రెండు రూమ్‌ల్లో 17 కంప్యూటర్లు.. హై ఎండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ …సహా ట్యాపింగ్ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇలా ఖతర్నాక్ సెటప్ సెట్ చేశారు. ట్యాప్ చేసిన కాల్‌డేటాలను ఎప్పటికప్పుడు హార్డ్ డిస్క్‌లో సేవ్ చేశారు. SIBకి గుండెకాయలాంటి లాగర్ రూమ్ యాక్టివిటీ మొత్తాన్ని తన గుప్పిట్లో తెచ్చుకున్న ప్రణీత్‌రావు…. తన టీమ్ ద్వారా రాజకీయ నేతలు, రియల్టర్లు, వ్యాపార ప్రముఖులతో పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేయించాడు.
అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో పలువురు రాజకీయ నేతలు, రియల్టర్ల ఫోన్‌లను ప్రణీత్‌రావు ట్యాప్ చేశారని ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఆ కాల్ రికార్డ్స్‌ను కొందరు కీలక నేతలకు చేరవేశారని స్పష్టంగా పొందుపరిచారు. ట్యాప్ చేసిన కాల్ రికార్డింగ్స్‌ను తన పర్సనల్ ఫోన్ నుంచి వాట్సప్ ద్వారా కీలక నేతలకు చేరవేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇక కస్టడీ విచారణలో అంతకు మించిన సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయో లేదో అదే రోజు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు దర్యాప్తులో తేల్చారు పోలీసులు. విచారణలో భాగంగా ప్రణీత్‌రావును ఎఐబీ ఆఫీసుకు తీసుకెళ్లి సీన్ రీ -కన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు. హార్డ్‌డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు? ఎవరి ఆదేశాలతో CDR, IMEI, IPDR డేటాను తొలగించారు? పెన్ డ్రైవ్ ఏమైంది? ట్యాపింగ్ చేసిన కాల్‌డేటాను ఎవరికి పంపించారు? ట్యాపింగ్‌లో ఆరుగురుతో పాటు ఇంకా సహకరించిన వాళ్లెవరున్నారు? ఇలా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రణీత్‌రావు దగ్గర మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన వాట్సాప్ చాట్‌లను రిట్రైవ్ చేశారు. ప్రణీత్ డైరీలో వరంగల్ జిల్లాకు చెందిన నాయకులు సహా మరికొందరి నెంబర్లు వున్నాయి. వాళ్లు పంపిన ఫోన్ నెంబర్లను ప్రణీత్ అండ్ టీమ్ ట్యాప్ చేసినట్టు ఎంక్వయిరీలో ట్యాలీ కావడంతో రాజకీయ లింకులపై మరింత ఫోకస్ పెట్టారు పోలీసులు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘీక శక్తులపై కదలికలను పసిగట్టాల్సిన టెక్నాలజీని, అధికారాన్ని ప్రణీత్ రావు ఉద్దేశపూర్వంగా దుర్వినియోగం చేశారని ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా ప్రయివేటు వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేశారనే అభియోగంతో ప్రణీత్‌రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసే యోచనలో ఉన్నారు పోలీసులు.