Hyderabad: దళిత మహిళపై దాష్టీకం.. డీఐ సహా ఐదుగురు కానిస్టేబుల్స్ సస్పెండ్

|

Aug 05, 2024 | 4:19 PM

షాద్‌నగర్‌లో మహిళపై థర్డ్‌ డిగ్రీ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బాధితురాలిని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రంలో ఎవరికి ఇష్టం వచ్చిన తరహాలో వాళ్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో డీఐ రాంరెడ్డి సహా ఐదుగురు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

Hyderabad: దళిత మహిళపై దాష్టీకం.. డీఐ సహా ఐదుగురు కానిస్టేబుల్స్ సస్పెండ్
Sunitha - Detective Inspector Ramireddy
Follow us on

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ ఘటనలో విచారణ కొనసాగుతోంది. చోరీ కేసులో దళిత మహిళను కొట్టడంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించి, వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సైబరాబాద్ సీపీ అవినాష్‌ మహంతి చర్యలకు ఉపక్రమించారు. షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామితో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మేరకు డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు. షాద్‌నగర్‌ అంబేద్కర్ కాలనీలో 2 వారాల క్రితం ఓ ఇంట్లో 24 తులాల బంగారం, 2 లక్షల నగదు పోయిందంటూ ఆ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. వారి ఎదురింట్లో నివాసం ఉంటున్న సునీత, ఆమె భర్తను స్టేషన్‌కి పిలిపించారు. విచారణ పేరుతో విచక్షణా రహితంగా కొట్టారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. దీంతో తాను నడవలేని స్థితికి వచ్చినట్లు తెలిపింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు సునీత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తానూ ఎలాంటి దొంగతనం చేయలేదని టీవీ9తో స్పష్టం చేసింది. ఇన్‌స్పెక్టర్‌ రాంరెడ్డి సహా నలుగురు పోలీసులు అర్థరాత్రి 2 గంటల వరకూ తనను చితకబాదారని చెప్పింది. ఎంతచెప్పినా వినకుండా కొడుకు, భర్త ముందే లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నేరం రుజువైతే రిమాండ్‌కు తరలించాలి కానీ ఇలా విచక్షణారహితంగా దాడి చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. మానవ హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. పోలీస్‌ అధికార దుర్వినియోగానికి ఈ ఘటన నిదర్శనమని అన్నారు. బాధితురాలని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. గత గురువారమే బాధితురాలిని ఇంటికి పంపారు, అసెంబ్లీ జరుగుతుంది కాబ్టటే ఘటనను గోప్యంగా ఉంచారని ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..