SCCL Union Elections 2023: సింగరేణిలో కార్మిక సంఘాలు విసృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. నల్ల బంగారు సిరుల మాగాని సింగరేణి సంస్థలో ఏడవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 27న జరగనున్న సింగరేణి ఎన్నికలను అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. విజయం కోసం విస్తృత ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరుచుకుని కార్మికుల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. కార్మికుల సొంత ఇంటి కల, అలవెన్స్ లపై ఇన్కమ్ టాక్స్ రియంబర్స్ మెంట్, మెరుగైన విద్య, వైద్యం, రక్షణ, తాగునీరు లాంటి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ఎంచుకుని కార్మిక సంఘాలు ముందుకు సాగుతున్నాయి. గత రెండు పర్యాయాలు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచి తిరుగులేని శక్తిగా ఎదిగిన BRS అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఇటీవల అగ్ర నాయకుల రాజీనామాలతో చతికిల పడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరోవైపు AITUC – INTUC మధ్య పొత్తు కోసం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో అతిపెద్ద యూనియన్ గా ఉన్న AITUC కి, రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ INTUC యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థలో మిగిలిన జాతీయ కార్మిక సంఘాలు ప్రాతినిథ్యం కోసం ముమ్మర ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కోల్ బెల్ట్ ప్రాంతంలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం నుంచి సింగరేణి ఎన్నికల సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ అనుబంధ సంఘమైన INTUC గెలుపు కోసం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగును పులుముకున్నాయి. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో CPI సహా ఇతర పార్టీల నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సింగరేణి ఎన్నికలను కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ప్రతిష్టాత్మకంగా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, అసెంబ్లీలో దోస్తీ చేస్తూ సింగరేణి ఎన్నికల్లో కుస్తీ పడుతున్న కాంగ్రెస్ – సిపిఐ వ్యవహారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..