
తమ ఊరి చెరువును హెటిరో పూర్తిస్థాయిలో విషతుల్యంగా మార్చిందంటూ సంగారెడ్డి జిల్లా దోమడుగు ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కనీసం చెరువులోని నీరు గులాబీ రంగులోకి ఎందుకు మారిందో కూడా అధికారులు ఇప్పటి వరకు చెప్పలేదని.. నీటి నమూనాలు తీసుకెళ్లి నాలుగు నెలలు గడిచినా, ఫలితాలు కూడా ఇవ్వలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా వారు పాడి పశువులను తీసుకొని రోడ్డెక్కి వినూత్న నిరసన తెలిపారు. ఇప్పటికైనా తమ ఊరి చెరువును పరిరక్షించాలని స్థానికులు వేడుకుంటున్నారు.ఈ గ్రామంలో నల్లకుంట చెరువు పూర్తిగా కలుషితమైపోయింది. దీంతో భూగర్భజలాలూ విషపూరితంగా మారాయి. చెరువు నీళ్లే కాదు బోర్లలో నీళ్లు తాగినా పశువులు చనిపోతున్నాయని పాడి రైతులు చెబుతున్నారు. బర్రెలు ఈనినా, దూడలు నెల రోజులకే మృత్యువాతపడుతున్న దయనీయ పరిస్థితి. దీంతో తాము అన్ని విధాలుగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశువులను తీసుకొచ్చి రోడ్డెక్కారు. ‘హెటిరో సంస్థను మూసేయాలి’, ‘బతికే హక్కును కాపాడండి’ ‘సేవ్ దోమడుగు’ అంటూ ఫ్లకార్డులు పట్టుకొని, నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
వేల మంది ప్రజలు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నా, సమస్యకు పరిష్కారం చూపాలనే ఆలోచన కూడా చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వినూత్న నిరసన ర్యాలీ చేపట్టారు. జాతీయ రహదారి పైకి పశువులతో వచ్చి నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..