
ప్రపంచమంతా 2026 కొత్త ఏడాది వేడుకల్లో ఘనంగా నిర్వహించి ఇప్పుడిప్పుడే ఆ సంబరాల నుంచి బయటికొస్తున్నారు. కానీ ఈ భూమి మీద ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం న్యూ ఇయర్ 2026 రాలేదు. అంతేనా క్రిస్మస్ కూడా రాలేదు. అవును, మీరు విన్నది నిజమే! మనమంతా జనవరి మొదటివారంలో ఉంటే.. ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఇంకా డిసెంబర్ మూడ్ లోనే ఉన్నారు. రేపు అంటే జనవరి 6 వారు క్రిస్మస్ జరుపుకోబోతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాల నిజం. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అనుసరిస్తాం. దీని ప్రకారం డిసెంబర్ 25న క్రిస్మస్, జనవరి 1న న్యూ ఇయర్ వస్తుంది. కానీ స్కాట్లాండ్ లోని ఫౌలా అనే చిన్న ద్వీపం మాత్రం ఇప్పటికీ పాత జూలియన్ క్యాలెండర్ నే పాటిస్తోంది. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జనవరి 6న జరుగుతాయి. ఇక కొత్త ఏడాది వేడుకలు జనవరి 13న నిర్వహిస్తారు. బ్రిటన్ అంతా 1752లోనే క్యాలెండర్ మార్చినా ఈ ద్వీపవాసులు మాత్రం తమ పాత సంప్రదాయాలనే కొనసాగిస్తున్నారు.
కేవలం ఫౌలా మాత్రమే కాదు, రష్యా, సైబీరియా, ఇథియోపియా వంటి దేశాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు జనవరిలోనే జరుగుతాయి. రష్యాలోని ఆర్థోడాక్స్ చర్చి జూలియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తుంది. దీని ప్రకారం జనవరి 7న అక్కడ అధికారికంగా క్రిస్మస్ జరుపుకుంటారు. అంటే ప్రపంచం కొత్త ఏడాదిలో వారం రోజులు గడిపేసిన తర్వాత గానీ వారికి పండుగ రాదు. ఒకవేళ మీరు డిసెంబర్ 25న క్రిస్మస్ మిస్ అయి ఉంటే, లేదా ఆ వేడుకలను మళ్ళీ జరుపుకోవాలని ఉంటే.. ఈ ప్రాంతాలకు వెళ్తే టైమ్ ట్రావెల్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫౌలా ద్వీపంలో కేవలం 30-40 మంది మాత్రమే నివసిస్తారు. ఇక్కడ పండుగ అంటే కేవలం విందులు, వినోదాలు మాత్రమే కాదు.. ఊరంతా ఒకే కుటుంబంలా కలిసి జరుపుకునే ఒక ఆత్మీయ వేడుక. ఇక్కడ నార్న్ అనే పురాతన భాషా ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి, ఇది పర్యాటకులకు ఒక విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండేవారు రెండుసార్లు క్రిస్మస్, రెండుసార్లు న్యూ ఇయర్ జరుపుకునే అవకాశం ఉంటుంది. మెయిన్ ల్యాండ్ లో ఒకసారి, తమ ద్వీపంలో మరోసారి పండుగ చేసుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..