
రాత్రనక పగలనక కాయాకష్టం చేసుకుని బతికేది జానెడు పొట్ట నింపుకోవడానికే.. ఇతరుల మీద ఆధారపడకుండా నాలుగు రాళ్లు వెనకేసుకునేది భవిష్యత్తు బాగుండాలనే. అలాంటి వాళ్ల కష్టాన్ని తమ బలంతో కొట్టేయాలనుకునేవాళ్లను ఏమనాలి. పని చేసినందుకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా దౌర్జన్యం చేసేవాళ్లను రౌడీలనే పిలవాలిగా. అలాంటి రౌడీలే హైదరాబాద్ నగరంలో రెచ్చిపోయారు . సెలూన్ షాపుకు వచ్చి కటింగ్ చేయించుకున్నాక.. డబ్బులు ఇచ్చి వెళ్లండని అడిగిన పాపానికి అమాయకులను కొందరు చావబాదారు. ఇదెక్కడి దౌర్జన్యం అంటూ నిలదీస్తే తమ ప్రతాపాన్ని చూపించి ఇష్టారీతిన వ్యవహరించారు.
హైదరాబాద్ నగరం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి కొంత మంది స్థానికంగా ఉన్న ఓ సెలూన్ షాపుకు వచ్చారు. కటింగ్ చేయించుకుని వెళ్లిపోతుండగా ఆ షాపులో పని చేసే వ్యక్తి కటింగ్ చేసినందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అయితే.. మమ్మల్నే డబ్బులు అడుగుతావా, అసలు ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదంటూ ఆ వచ్చినవారు దౌర్జన్యంగా మాట్లాడారు. అదేంటీ.. కటింగ్ చేయించుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా ఎలా వెళ్తారని నిలదీయడంతో వాళ్లు మరింత రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా ఏకంగా సెలూన్ షాపుపై దాడి చేశారు. ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. అటుగా రోడ్డుపై వెళ్తున్న కొందరు ఇది గమనించి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పైగా ఆపడానికి వచ్చినవాళ్లని కూడా తీవ్రంగా కొట్టడంతో అందులో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చావుబతుకుల మధ్య ప్రస్తుతం ఆ యువకుడు ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు.
జీవనోపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి నగరానికి వచ్చి కొందరు యువకులు ఆయా ప్రాంతాల్లో సెలూన్ షాపులు నిర్వహించుకుని సంపాదించుకుంటున్నారు. ఎక్కడో దూరం నుంచి వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటుంటే.. నగరంలోని రౌడీషీటర్లు దౌర్జన్యం చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి.తాము ఏమీ అనలేదని, కటింగ్ చేయించుకున్నందుకు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకే ఈ విధంగా తీవ్రంగా తమపై దాడులు చేశారని సెలూన్ నిర్వాహకులు వాపోతున్నారు. ఇలాంటి ఆగడాలు అరికట్టాలంటే పోలీసులు తమకు సాయపడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా వ్యవహరించాలని కోరుతున్నారు.
వీడియో దిగువన చూడండి…