అంత్యక్రియలకు బయలుదేరారు.. అంతలోనే జోరు వాన! చివరికి ఏం చేశారంటే..?

నిర్మల్ జిల్లా తానూరు మండలం ఝరి(బి) గ్రామంలో స్మశానం లేకపోవడంతో ఓ కుటుంబం రోడ్డుపై అంత్యక్రియలు నిర్వహించవలసి వచ్చింది. జోరు వర్షంలో మృతదేహాన్ని కాపాడుకోవడంలో కష్టాలు పడ్డారు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాలలోని మౌలిక సదుపాయాల లోపాన్ని వెల్లడిస్తుంది. అధికారులు స్పందించి స్మశానం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Edited By:

Updated on: May 28, 2025 | 5:01 PM

పేదోడైనా.. పెద్దోడైనా.. ఉన్నోడైనా.. లేనోడైనా.. చివరికి చేరాల్సింది కాటికే. కాటిలో బూడిదై ఏటిలో కలిసే మనిషి చివరి మజిలీ అదే. కానీ ఆ ఆకరి మజిలీ చేరే చోటే లేకపోతే. నడి రోడ్డే ఆఖరికి మజిలీకి నిలయంగా మారితే. ఆ కష్టాలు ఇలాగే ఉంటాయేమో.. వర్షంలో తడుస్తూ కట్టె కాలే దారి లేక వరుణుడిని కాసేపు శాంతించమని కన్నీటితో వేడుకుంటూ అంత్యక్రియలు చేసేందుకు ఎదురు‌ చూడక తప్పదేమో. ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి (బి) గ్రామంలో చోటు చేసుకుంది.

ఝరి(బి) గ్రామానికి చెందిన పోసాని బాయి (53) అనే వృద్దురాలు అనారోగ్యంతో మృతి చెందింది. సాంప్రదాయ ప్రకారం మృతురాలిని అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు స్మశానానికి‌ బయలు దేరారు. కానీ అక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో నడి రోడ్డు పైనే అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు‌ చేశారు. చితిని పేర్చి కుటుంబ సభ్యుల చివరి చూపు‌కోసం పోసాని ‌బాయి మృతదేహాన్ని ఉంచారు. అంతలోనే జోరున వర్షం కురవడంతో ఆఖరి మజిలీ కష్టాలు తారస్థాయికి చేరాయి. భారీ వర్షంలో మృతదేహాన్ని తడవకుండా ఉంచేందుకు నానా తిప్పలు పడ్డారు బందువులు.

వర్షం ఎంతకు‌ తగ్గకపోవడంతో అంత్యక్రియల కోసం పేర్చిన చితిపై పెద్ద తాటిపత్రి కవర్లను కప్పి బంధువులంతా మృతదేహాం చుట్టు చేరి ఆ జోరు వానలోనే తడుస్తూ ఉండిపోయారు. మూడు గంటల విరామం తర్వాత వర్షం తగ్గడంతో ఇలాంటి కష్టం పగోడికి కూడా రావొద్దు భగవంతుడా అంటూ ఆఖరి కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన నిర్మాణం చేపట్టి ఇలాంటి కష్టాలను తీర్చాలని.. సరైన సదుపాయాలు కల్పించాలని వేడుకున్నారు ఝరి గ్రామస్తులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి