Krishna and Godavari Rivers : భారీ వర్షాలకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలంలో నీటిమట్టం 41.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అదే నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇవాళ సాయంత్రం వరకూ గోదావరి నీటిమట్టం మరో ఐదారు అడుగులు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు, దాదాపు పదిరోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షాలకు కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల నిండుకుండలా మారింది. దాంతో ప్రాజెక్టు అధికారులు 31 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2 లక్షల 25 వేలు ఉంటే…ఔట్ ఫ్లో 2 లక్షల 16వేల 918 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు ఉండగా…ప్రస్తుతం నీటినిల్వ 5.623 టీఎంసీలుగా ఉంది.
Read also : KTR Birthday : వరంగల్‌లో వెరైటీగా కేటీఆర్ బర్త్ డే, స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన ఎర్రబెల్లి, నన్నపునేని