
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామ్యులంటూ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అంటూ తెలిపారు. ప్రజలు ప్రగతిభవన్ కు రావొచ్చంంటూ వెల్లడించారు. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రసంగం అనంతరం రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీల అభయహస్తం అమలు ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగాన్ని కల్పిస్తూ సంతకం చేశారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం.. తొలి సంతకం అభయహస్తం ఫైలుపై.. ఆ తర్వాత రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. కాగా.. ఉద్యోగం కల్పించాలని రజిని అనే దివ్యాంగురాలు కొంతకాలం క్రితం గాంధీభవన్ లో కలిసి రేవంత్ ను కోరగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని హామీనిచ్చారు. ఆ మాట ప్రకారం.. రజినికి ఉద్యోగం కల్పిస్తూ ఫైలుపై సంతకం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..