Telangana: తెలంగాణ ప్రజలకు తీపికబురు.. కొత్తగా 31 ప్రభుత్వ ఆస్పత్రులు.. పేదలకు వైద్యం ఫ్రీ

తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. కొత్తగా 31 ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తోంది. అలాగే ప్రభుత్వం ఉన్న హాస్పిటల్స్‌ను ఆధునీకరిస్తోంది. ప్రస్తుతం ఉన్న పడకలను మరింతగా పెంచుతోంది. మండల, జిల్లా స్థాయిలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana: తెలంగాణ ప్రజలకు తీపికబురు.. కొత్తగా 31 ప్రభుత్వ ఆస్పత్రులు.. పేదలకు వైద్యం ఫ్రీ
Hospital

Updated on: Mar 11, 2026 | 4:58 PM

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులను మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కొత్త ప్రభుత్వ హాస్పిటల్స్‌ నిర్మాణానికి ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 31 ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తోండగా.. ఇప్పటికే ఉన్న హాస్పిటళ్లను కొత్త హంగులతో తీర్చిదిద్దుతోంది. ఇక మరో 38 గవర్నమెంట్ ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేసేందుకు రెడీ అవుతోంది. 6 పడకల ఆస్పత్రులను 100 పడకలుగా.. 30 పడకల హాస్పిటళ్లను 250 పడకలుగా మారుస్తోంది. వీటిల్లో 9 రకాల వైద్య సేవలు అందించనుండగా.. డాక్టర్లు, వైద్య పరికరాలను ఏర్పాటు చేయనుంది.

సమీప మండల కేంద్రాల్లోనే సేవలు

ఏదైనా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదు. సమీపంలోని మండలం లేదా జిల్లా కేంద్రంలోనే ప్రజలకు వైద్య సేవలు పొందవచ్చు. దీంతో మండల, జిల్లా కేంద్రాల్లో స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు కొత్త ఆస్పత్రులను నిర్మిస్తోంది. దీంతో అత్యవసర సేవల కోసం హైదరాబాద్‌ వరకు రావాల్సిన పని ఉండదు. సమీపంలోని మండల, జిల్లా కేంద్రాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉండనున్నాయి. ఉన్న ఆస్పత్రులను ఆధునీకరించేందుకు, కొత్త హాస్పిటళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,908 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఆస్పత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్య సేవలు పేదలకు అందించనున్నారు. మెడికల్ టెస్టుల కోసం అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.

ఉచితంగా వైద్య సేవలు

సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అనస్ధీషియా పరికరాలు ఉంటాయి. ఇక గైనకాలజీ, పాలీట్రామా, ఆర్థోపెడిక్, పల్మనరీ మెడిసిన్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసన్, పీడీయాట్రిక్స్ వంటి సేవలను ఉచితంగా పేదలు పొందవచ్చు. రూపాయి కూడా ఖర్చు చేయకుండా అత్యాధునిక వైద్య సేవలు పొందవచ్చు. అటు హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. సనత్ నగర్ టిమ్స్ పనులు ఇప్పటికే పూర్తవ్వగా.. ఉగాది రోజున ప్రారంభించేందుకు ప్రభుత్వం మూహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఇక ఎల్బీ నగర్ టిమ్స్ పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయి. పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం వీటిని నిర్మించింది. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. వీటి రాకతో ఆ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గనుంది.  ఈ ఆస్పత్రుల్లో సర్జరీలు ఉచితంగా చేస్తారు. ఇందుకోసం అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ ప్రజలకు వీటి వల్ల ఉచిత వైద్య సేవలు పొందవచ్చు.

Follow Us