తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రాబ్లమ్ క్లియర్ చేయడంలో స్పీడ్ పెంచింది. తాజాగా.. భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ.. 317జీవోపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ.. 317పై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చింది? తీసుకున్న కీలక నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఎన్నికల హడావుడి ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే.. 317జీవోపై ఏర్పాటైన తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 317 జీవోలో మార్పులు, ఇతర అంశాలపై సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ.. సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు అన్వేషించింది. ఈ సందర్భంగా.. పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది కేబినెట్ సబ్ కమిటీ. విధుల్లో సర్దుబాటు కావాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి 30వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 317 జీవో బాధితుల కోసం ఇటీవల గ్రీవెన్స్ వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. సుమారు 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. ఆయా దరఖాస్తుల రీ-వెరీఫికేషన్ తర్వాత విధుల సర్దుబాట్లు చేయనున్నట్లు వెల్లడించింది కేబినెట్ సబ్ కమిటీ. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ ఆప్షన్‌తోపాటు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య, భర్తలకు కూడా ఆప్షన్స్, మల్టిపుల్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత.. దానికి సంబంధించిన స్టేటస్‌ను వారివారి మొబైల్ నంబర్లకు మెసేజ్ పంపనున్నట్లు వెల్లడించింది.
ఇక.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అప్పటి ప్రభుత్వం 2016లో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, మల్టీ జోన్లకు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు 2021 డిసెంబర్ 6న 317జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. ఉద్యోగులు.. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది. అయితే.. పోస్టింగ్ విషయంలో సీనియార్టీకి ప్రిపరెన్స్ ఇవ్వడం వివాదాస్పదం అయింది. సీనియర్లు డిమాండ్ ఉన్న చోటకు వెళ్తే మిగతావారికి అవకాశం ఉండదు. దాంతో.. సొంత జిల్లాలకు చెందినవారైనప్పటికీ.. కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ లభించదు. ఫలితంగా.. ఉద్యోగుల ప్రమోషన్లు, పే స్కేల్స్ వంటి అంశాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాంతో.. ప్రభుత్వ ఉద్యోగులు 317 జీవోని తీవ్రంగా వ్యతిరేకించారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విధుల కేటాయింపుల్లో స్థానికత అనే అంశాన్నే మార్చివేశారంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ జిల్లాల్లో కాకుండా పరాయి జిల్లాల్లో విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. వందల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రతిరోజూ ప్రయాణం చేయలేకపోతున్నామంటూ ఆందోళనలకు దిగారు. ఉద్యోగ సంఘాలకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ మద్దతు తెలిపింది. అధికారంలోకి వస్తే 317 జీవో బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఆ మేరకు అధికారంలోకి రావడంతో 317 జీవోపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తప్పకుండా సొంత జిల్లాలకు పంపిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానిలో భాగంగానే..317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ వేయగా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. తాజాగా.. సమావేశమై కీలక నిర్ణయాలు ప్రకటించింది. మొత్తంగా.. విధుల్లో సర్దుబాట్లు కావాలనుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చన్న కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…