
రెండు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఆర్ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న పేషెంటును ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది. ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న భరత్ కుమార్ అనే పేషంట్ వేలిని ఎలుకలు కొరికాయి. భరత్ కుమార్ కాలికి ఇన్ఫెక్షన్ ఏర్పడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అర్ధరాత్రి పూట అతడి చేతివేళ్లను ఎలుకలు కొరికాయి. కుటుంబ సభ్యులు గమనించి వైద్య సిబ్బందికి సమాచారం అందించడంతో టీటీ ఇంజక్షన్ ఇప్పించి ఇన్ఫెక్షన్ రాకుండా చికిత్స అందించారు.
ప్రసూతి ఆస్పత్రిలోనూ ఎలుకల స్వైరవిహారం
అటు వరంగల్ లోని ప్రభుత్వ సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో ఎలుకల స్వైర విహారంపై కొద్ది రోజుల క్రితమే టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. అయినా MGM ఆస్పత్రి వర్గాలు మొద్దు నిద్దర వీడకపోవడంతో ఈ ఘటన జరిగింది. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో డీఎంఈ నరేంద్ర కుమార్ స్వయంగా ఎంజీఎం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఎలుక కాటుకు గురైన పేషెంట్ ను పరామర్శించారు. ఎలుకల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు.
ఎలుకల స్వైర విహారం నేపథ్యంలో రోగులు, వాళ్ళ బంధువులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఎలుకలు ఎవరిని ఎప్పుడు రక్కి గాయపరుస్తాయో అనే ఆందోళన కనిపిస్తోంది.. ఇన్ పేషెంట్ వార్డుల్లో, ఐసీయూల్లో కూడా ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.
ఎలుకల కోసం పాములు కూడా వస్తున్నాయని పేషెంట్లతో పాటు, ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది కూడా బెంబేలెత్తుతున్నారు. ఎలుకల స్వైర విహారానికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.