Rangareddy District: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు.. కొట్టుకుపోయిన కారు.. నవ దంపతులతో సహా ఐదుగురు గల్లంతు

|

Aug 29, 2021 | 9:28 PM

కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది.

Rangareddy District: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు.. కొట్టుకుపోయిన కారు.. నవ దంపతులతో సహా ఐదుగురు గల్లంతు
Car Washed Away In A Musi River
Follow us on

Car Washed Away in Musi River: గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్‌ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. మోమిన్ పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన కారులో నవ వధు,వరులు నవాజ్ రెడ్డి, ప్రవళ్లిక, వరుడి అక్కలు శ్వేత, రాధమ్మ, డ్రైవర్‌తో పాటు మరో బాలుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి మోమిన్ పేటకు చెందిన ప్రవళ్లికతో వివాహం జరగగా ఈ రోజు మోమిన్‌పేటకు వెళ్లి వస్తుండగా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది.రోడ్డుపై నీరు పారుతుండగా వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

మరోవైపు, శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి బయటపడగా.. మరో వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.అయితే, చివరికి ఓ చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. కాగా, అతన్ని స్థానికులు అతి కష్టం మీద కాపాడారు.

కాగా, మూసీ ప్రాజెక్టు ద్వారా ఆదివారం 2152.95 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా 1909.20 క్యూసెక్కులు, కాలువలకు 142.83 క్యూసెక్కులు వెళుతుండగా, 49.07 క్యూసెక్కులు ఆవిరవుతుంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 2847..75 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 643.12 అడుగులు(3.97 టీఎంసీలు)లకు చేరుకుంది.

మరోవైపు బంగాళ ఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం కొనసాగుతుందని, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవాళ, రేపు చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం వివరించింది.

Read Also.. ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ.. పూర్తి వివరాలు