
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి పాము కాటుతో మృతి చెందడంతో గ్రామం మొత్తం విషాదంలో కూరుకుపోయింది.. వివరాల ప్రకారం.. ఆశిరెడ్డిపల్లికి చెందిన రమేష్, సుమలత దంపతుల కూతురు చేకుట వేదాన్షి శనివారం రాత్రి ఇంటిముందు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. రాత్రి వేళ పాప ఇంట్లో నేలమీద ఆడుకుంటుండగా.. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న విషసర్పం కాటు వేసింది.. దానిని ముందు ఎవరూ చూడలేదు..
ఈ క్రమంలోనే.. మొదటగా చిన్నారి ఏడవడం, కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గమనించిన తల్లిదండ్రులు.. వెంటనే పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పరిశీలించిన అక్కడి వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ వార్త విన్న వెంటనే తల్లిదండ్రులు బోరున విలపించారు.. వారి వేదనను చూసిన గ్రామమంతా కన్నీటి వాతావరణంలో మునిగిపోయింది.
చిన్నారి వేదాన్షి మరణవార్త తెలియగానే పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. “ఆ పాప నవ్వు, చలాకీతనం ఇప్పటికీ కళ్లముందే ఉంది. ఇంత చిన్న వయసులో ఇలా చనిపోవడం భరించలేకపోతున్నాం” అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నాయి.. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..