తెలంగాణ రాజకీయం మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ఉప ఎన్నిక వస్తుందా? రాదా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిగో అదిగో అంటూ రాజీనామాపైనా, బీజేపీలో చేరడంపైనా రోజూ దానిపైనే చర్చ ఉండేలా చూసుకుంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించినా రాజీనామాపై మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదన్న ఆలోచనతోనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే దాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉప ఎన్నికకు సిద్ధమై ప్రజలు మార్పు తెస్తానంటే ఉప ఎన్నిక వస్తుందన్నారు రాజగోపాల్‌రెడ్డి.
ప్రజలు అనుకుంటే, మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే ఉప ఎన్నిక ఖాయమని వ్యాఖ్యానించారు. అంటే తాను రాజీనామా చేసినా మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం వస్తేనే ముందుకు వెళ్లాలనేది ఈయన ప్లాన్‌గా కనిపిస్తోంది. మరోవైపు ఉప ఎన్నిక కచ్చితంగా వస్తుందనే పొలిటికల్ పిక్చర్ రావడం వల్ల మునుగోడు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌లోనూ ఇలాగే జరిగిందని, అదే ఇక్కడ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు రాజగోపాల్‌రెడ్డి.
రాజగోపాల్‌రెడ్డి తన ప్లాన్లు తాను వేసుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం ఆయన రాజీనామా చేయకుండా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అధిష్టానం ఆదేశంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి విడివిడిగా ఆయనతో చర్చలు జరిపారు. అయినా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి మనస్తాపం చెందిన మాట వాస్తవమేకానీ, ఆయన రాజీనామా చేయబోరన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
కాంగ్రెస్ ఎంత బుజ్జగిస్తున్నా రాజీనామా చేస్తే జరిగే పరిణామాలపై ఒక అంచనాకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న ప్లాన్‌తో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. అందుకోసమే మరో పది, 15 రోజుల తర్వాత యుద్ధాన్ని ప్రకటిస్తానని, ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారాయన.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..