పోకిరీలు వేధిస్తుంటే.. నిర్భయంగా ఫిర్యాదు చేయండి! నంబర్లు ఇవే..

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలపై వేధింపులకు పాల్పడిన 203 మందిని (మేజర్స్ 138, మైనర్స్ 65) షీ టీమ్స్ అధికారులు కౌన్సింగ్ ఇచ్చారు. ఫోన్, సోషల్ మీడియా, నేరుగా వేధింపులు చేసిన వారిని పట్టుకుని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళలు వేధింపులకు గురైన వెంటనే షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ సూచించారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు.

పోకిరీలు వేధిస్తుంటే.. నిర్భయంగా ఫిర్యాదు చేయండి! నంబర్లు ఇవే..
She Team

Updated on: Apr 09, 2025 | 6:42 PM

బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు(ఐపిఎస్) తెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడించే, వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఈరోజు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తున్న 203 (మేజర్స్-138, మైనర్స్-65) మందిని మార్చి 1 నుంచి 31 మధ్య షీ టీమ్స్ పట్టుకున్నారు. వారికి ఎల్‌బి నగర్ CP Camp office (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు)లో, కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. వీటిలో ఫోన్ల ద్వారా వేధింపులు-30, సోషల్ మీడియాలో వేధింపులు-87, నేరుగా వేధింపులు – 132.

మహిళలు వేధింపులకు గురైతే వెంటనే షీ టీమ్స్‌ రాచకొండ వాట్సాప్‌ నెంబర్ 8712662111 ద్వారా లేదా ఆ ప్రాంత షీ టీమ్ అధికారుల నంబర్లు భువనగిరి 8712662598, చౌటుప్పల్‌ 8712662599, ఇబ్రహీం పట్నం 8712662600, కుషాయి గూడ 8712662601, ఎల్‌బీ నగర్‌ 8712662602, మల్కాజ్‌గిరి 8712662603, వనస్థలీపురం 8712662604 నంబర్లకు మేసేజ్‌ చేసి నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.