
సినిమాల్లోని మన హీరోల డైలాగ్స్ అప్పుడప్పుడు రాజకీయాల్లోనూ మారుమోగుతుంటాయి. అయితే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప-2 లోని రప్పా రప్పా డైలాగ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ మారాయి. గత వారం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సందర్భంగా ర్యాలీలో వెలసిన ఈ రప్పా, రప్పా డైలాగ్ ప్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్‌లో వైసీపీ అధినేత జగన్ కూడా ఈ రప్పా రప్పా డైలాగ్‌ను వాడడం దీన్ని మరింత ప్రభావం చేసింది. దీంతో ఏపీలో ఈ డైలాగ్ పొలిటికల్ ట్రెండ్‌గా మారింది.
అయితే ఏపీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తెలంగాణకు చేరింది. మొదట ఈ డైలాగ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు సిద్దిపేటలో దర్శనమివ్వగా తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కనిపించాయి. బీఆర్ఎస్ రప్పా -రప్పా 3.0 లోడింగ్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సూర్యాపేటలో రప్పా రప్పా 3.0 లోడింగ్” అనే ప్రకటనలు దర్శనమిస్తున్నాయి.
కాగా జిల్లాలోని పలు కూడళ్లలో బీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలలో .. సూర్యాపేటలో రప్పా రప్పా 3.0 లోడింగ్, 2028 అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఎమ్మెల్యే జగదీష్ అన్న సారథ్యంలో మేం రెడీ” అంటూ డైలాగ్స్ కనిపించాయి. ఈ ఫ్లెక్సీల్లోని నినాదాలు, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..