Nalgonda: అందులో మీరు ఇన్వెస్ట్ చేశారా?.. అయితే మీ డబ్బులు గోవింద! బోర్డు తిప్పేసిన పూణె కంపెనీ!
ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి ఘటనలు రోజూ మనం ఎన్నో చూస్తున్నాం. ఆన్ లైన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించినా.. ప్రజలు అవి పట్టించుకోకుండా అధిక వడ్డీకి ఆశపడి మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తమ యాప్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మించిన ఓ సంస్థ.. జనానికి కుచ్చుటోపి పెట్టింది. చైన్ సిస్టమ్ ద్వారా జనాల చేత కోట్లలో పెట్టుబడులు పెట్టించి బురిడీ కొట్టించింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని పూణె కేంద్రంగా 2018లో ” VIP”పేరుతో యాప్ ప్రారంభించిన ఓ సంస్థ. దేశంలోని పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజలను నిలువునా ముంచేస్తుంది. తాజాగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో తన బ్రాంచ్‌లను ఓపెన్ చేసింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలోనూ ఈ సంస్థ ఓ బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. ప్లాన్ ప్రకారం తమ యాప్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని స్థానిక ప్రజలకు నమ్మించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది సభ్యులు వీళ్ల కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. మొదట్లో కొందరికి ప్రాఫిట్ వస్తున్నట్టు చూపించారు. దీంతో ఒకరి ద్వారా ఒకరూ చైన సిస్టమ్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించారు. ఇక అందరినీ నమ్మించేందుకు వాళ్లు పెట్టిన డబ్బుకు రూ.3 వడ్డీ చొప్పున వాళ్ల ఖాతాల్లో డబ్బులు వేశారు. ఇలా రెండేళ్ల పాటు వడ్డీ డబ్బులు చెల్లించి అందరినీ నమ్మించారు.
దీంతో వడ్డీ బాగా వస్తుందనుకున్న ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థ ఎటూ పోదనే నమ్మకం పెట్టుబడి దారుల్లో కల్పించిన సంస్థ..ఒక్కసారిగా బోర్డు తిప్పేసింది. అక్కడి నుంచి పత్తా లేకుండా పరారైంది. దీంతో మోసపోయామని గ్రహించిన పెట్టుబడి పెట్టిన ప్రజలు తమ డబ్బులు పోయాయని లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఏజెంట్లు, డైరెక్టర్ల మాటలు నమ్మి భవిష్యత్తు అవసరాలు, పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులను పెట్టుబడి పెట్టామనీ బాధితులు చెబుతున్నారు. ఎలాగైనా న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నల్లగొండ పోలీసులు పూణెలోని యాప్ నిర్వాహకులను సంప్రదించారు. అయితే రెండేళ్లలో ఇబ్బందులు తొలగిపోతాయని, ప్రతి ఒక్కరికి బాండ్ ఇస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఏకీభవించని పోలీసులు వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల్లో బాధితులకు న్యాయం చేయకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
